ఆడపిల్లల ఉసురు మీకు మంచిది కాదు: సీఎం జగన్ పై లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Aug 20, 2021, 4:26 PM IST
Highlights

ప్రేమించిన యువతిపైనే ప్రియుడు పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన విజయనగరం ఘటనపై స్పందిస్తూ సీఎం జగన్ పై నారా లోకేష్ సీరియస్ అయ్యారు.  

మంగళగిరి: ప్రేమించిన వాడే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించిన అమానుష ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఆడ‌పిల్ల‌ల‌పై అరాచ‌కాల‌కు ఆంధ్ర‌ప్రదేశ్ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయిందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.  

''గుంటూరులో క్రిమిన‌ల్ క‌త్తివేట్ల‌కు మొన్న ర‌మ్య నేల‌కొరిగితే... నిన్న ఇదే గుంటూరు జిల్లా రాజుపాలెంలో ఓ చిన్నారి యువకుల ప‌శువాంఛ‌ల‌కు బలయ్యింది. నేడు విజ‌య‌న‌గ‌రం జిల్లా చౌడ‌వాడ‌లో ఉన్మాది పెట్రోల్ పోసి యువ‌తిని త‌గుల‌బెట్టారు. మూడురోజుల్లో ఆడ‌పిల్ల‌ల‌పై మూడు అమాన‌వీయ ఘ‌ట‌న‌లు జ‌రిగినా దున్న‌పోతు ప్ర‌భుత్వంలో స్పంద‌న‌లేదు'' అని లోకేష్ మండిపడ్డారు. 

''జగన్ రెడ్డి గారూ... మీ ఇంట్లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదు... మీ ఇంటి ప‌క్క నివ‌సించేవారూ అత్యాచారానికి గుర‌య్యారు. మీ పాల‌న‌లో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భ‌ద్ర‌త‌లేని భ‌యం భ‌యం బ‌తుకులైపోయాయి. ఇంకా లేని ఆ దిశ చ‌ట్టం... రక్షించ‌లేని దిశ‌యాప్ పేరుతో ప్ర‌చారం చేసుకోకండి... ప‌బ్లిసిటీయే సిగ్గుప‌డుతుంది'' అని ఎద్దేవా చేశారు. 

read more  విజయనగరంలో ప్రియురాలికి నిప్పు... దిశ యాప్ వల్లే యువతిని కాపాడాం: మంత్రి శ్రీవాణి (వీడియో)

''నిందితుల్ని ప‌ట్టుకుని శిక్షించ‌డంలో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తే రోజుకొకడు ఇలా మృగంలా ప్ర‌వ‌ర్తించ‌డు. బాధితుల్ని బాధిస్తూ, నిందితుల్ని ర‌క్షించే ప్ర‌భుత్వం అని స్ప‌ష్టం అవ్వ‌డంతో క్రిమిన‌ల్స్ చెల‌రేగిపోతున్నారు. ద‌య‌చేసి దృష్టిసారించండి. ఆడ‌పిల్ల‌ల ఉసురు త‌గిలితే మీకూ, ఈ రాష్ట్రానికీ మంచిది కాదు" అంటూ సీఎం జగన్ ను లోకేష్ హెచ్చరించారు. 

ప్రేమించిన వాడే ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చడానికి ప్రయత్నించిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో చోటుచేసుకుంది. రాములమ్మ అనే యువతిపై రాంబాబు పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన యువతి అక్క, ఆమె కుమారుడుకి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే వున్నట్లు తెలుస్తోంది.  

 

click me!