విజయనగరంలో ప్రియురాలికి నిప్పు... దిశ యాప్ వల్లే యువతిని కాపాడాం: మంత్రి శ్రీవాణి (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 20, 2021, 4:01 PM IST
Highlights

ప్రేమించిన యువతినే ఓ కిరాతకుడు అత్యంత దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయిన యువతి హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. తాజాగా బాధితురాలిని మంత్రులు బొత్స, పుష్పశ్రీవాణి పరామర్శించారు. 

విజ‌య‌న‌గ‌రం: మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠిన చట్టాలు తీసుకువచ్చినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మొన్న దళిత యువతి రమ్య హత్య, నిన్న గుంటూరు జిల్లాలో చిన్నారి గ్యాంగ్ రేప్ ఘటనలను మరువకుముందే ఇవాళ అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. ప్రేమించిన వాడే ఓ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో చోటుచేసుకుంది. 

ప్రేమించిన యువతినే ఓ కిరాతకుడు అత్యంత దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన యువతి అక్క, ఆమె కుమారుడుకి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇలా జిల్లా కేంద్ర ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు రాముల‌మ్మ‌తో పాటు ఆమె సోద‌రిని మంత్రులు పుష్ప‌శ్రీ‌వాణి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప‌రామ‌ర్శించారు. 

read more   ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పెట్రోల్ పోసి పరార్...

ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేద‌ని... మెరుగైన చికిత్స కోసం విశాఖ త‌ర‌లించి పూర్తిస్థాయిలో కోలుకొనే వర‌కు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త తీసుకుంటుంద‌ని మంత్రులు తెలిపారు. ఆమె చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చునంతా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ప్రకటించారు. రాములమ్మ‌తో మాట్లాడిన మంత్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే రాములమ్మ త‌ల్లి, సోద‌రితో మాట్లాడి జ‌రిగిన సంఘ‌టన గురించి తెలుసుకున్నారు.  

వీడియో

యువ‌తిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో పుష్ఫ శ్రీవాణి మాట్లాడుతూ... పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ దుర్ఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌రమని అన్నారు. పెళ్లిచేసుకోవ‌ల‌సిన వ్య‌క్తే త‌న‌కు కాబోయే భార్య‌పై అనుమానంతో దాడిచేయ‌డం అమానుషమని... దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం తెచ్చిన దిశ యాప్ ఈరోజు బాధితురాలి ప్రాణాన్ని కాపాడిందని పేర్కొన్నారు. 

దిశ యాప్‌ను బాధితురాలి సోద‌రి ఉపయోగించడంతో కేవలం 25 నిమిషాల్లో పోలీసులు గ్రామానికి చేరుకొని బాధితురాలిని, దాడిలో గాయ‌ప‌డ్డ మ‌రో ఇద్ద‌రిని ఆసుప‌త్రిలో తరలించి ప్రాణాలు కాపాడ‌గ‌లిగారన్నారు. రాష్ట్రంలోని ఆడ‌బిడ్డ‌లంతా ఇప్ప‌టికైనా దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఆప‌ద స‌మ‌యంలో ఎస్‌.ఓ.ఎస్‌. బ‌ట‌న్ నొక్కితే పోలీసుల ర‌క్ష‌ణ ల‌భిస్తుందని మంత్రి పుష్ఫశ్రీవాణి వెల్లడించారు. 

click me!