వివేకాను ఎవరు హత్య చేశారో ఆ ముగ్గురికి తెలుసు.. సీఐ శంకరయ్య

Published : Feb 24, 2022, 06:38 AM IST
వివేకాను ఎవరు హత్య చేశారో ఆ ముగ్గురికి తెలుసు.. సీఐ శంకరయ్య

సారాంశం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆయనను హత్య చేసింది ఎవరో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలకు తెలుసునంటూ అప్పటి సీఐ శంకరయ్య తెలిపారు. 

పులివెందుల : YS Vivekananda reddy హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారని.. అయినా తాను లొంగలేదని అప్పటి పులివెందుల ci shankaraiah సిబిఐకి తెలిపారు. ys avinash reddyతోపాటు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా ఒత్తిడి చేశారన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న భయంతోనే తొలుత హత్యానేరం (ఐపిసి సెక్షన్ 302) కింద కేసు నమోదు చేయలేకపోయానని వివరించారు. కేసు లేకుండానే వివేక మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వారు ప్రయత్నించారని చెప్పారు. 

అవినాష్ రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి అత్యంత సన్నిహితుడని, ఎర్ర గంగిరెడ్డి వివేకా వద్ద పిఎస్ గా పని చేశారని సీబీఐ అధికారులకు వివరించారు. వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసు అన్నారు. వీరందరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. ఈ మేరకు 2020 జూలై 28 న, గతేడాది సెప్టెంబర్ 28న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వాటిలోని మరికొన్ని అంశాలు తాజాగా వెలుగు చూశాయి.

దేవిరెడ్డి శివశంకర్రెడ్డి వైసీపీ నాయకుడు. డిసిసిబి మాజీ ఉపాధ్యక్షుడు.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.  ఆయన కార్యాలయాన్ని శివశంకర్రెడ్డే నిర్వహిస్తుంటారు. ఆయనతోపాటు ప్రచారంలో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, వేముల పోలీస్ స్టేషన్ లలో శివశంకర్ రెడ్డిపై 30కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఘటనా స్థలానికి నేను వెళ్లేసరికి శివశంకర్రెడ్డి అక్కడే ఉన్నారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించేందుకు  వీలుగా ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఫ్రీజర్ ను వివేక ఇంట్లోకి తెప్పించారు.

మృతదేహాన్ని అందులోకి తరలించకుండా నేను  అడ్డుకున్నాను. వీరిద్దరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా కనిపించింది’ అని  శంకరయ్య వాంగ్మూలం లో వివరించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు  ఘటనా స్థలం వద్ద భారీగా జనసమూహం ఉండడంతో వివేక మృతదేహంపై ఉన్న గాయాలకు బ్యాండేజీలు, కట్లు కడుతున్న వారిని నియంత్రించలేక పోయాను అని  ప్రస్తావించారు.

ఉదయ్ కుమార్ రెడ్డి మాట మార్చారు..  వాసుదేవన్..
వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీ వేకువజామున గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వివేక ఇంటి సమీపంలో తిరుగుతున్నట్లు దర్యాప్తులో గుర్తించామని గతంలో పులివెందుల డిఎస్పీగా పనిచేసిన ఆర్ వాసుదేవన్  సిబిఐకి తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే అంశంపై ఉదయ్ కుమార్ రెడ్డిని  2, 3  సార్లు ప్రశ్నించగా… ఒక్కోసారి ఒక్కోలా సమాధానాలిచ్చారు అని ఆయన వివరించారు. 2019 జూన్ 17 నుంచి ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఆయన గత ఏడాది సెప్టెంబరు 1న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

2019 మార్చి 15వ తేదీ ఉదయం 5.35 గంటలకు నేను మా ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి ఫోన్ చేసి తనను అవినాష్ రెడ్డి ఇంటి వద్ద దించాలని కోరడంతో అక్కడికి వెళ్లాను’ అంటూ ఒక సారి.. సురేంద్ర నాథ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చినప్పుడు తాను బస్టాండ్ లో ఉన్నానని, అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్లి పికప్ చేసుకుని అవినాష్రెడ్డి ఇంటి వద్ద విడిచిపెట్టానంటూ.. మరోసారి ఉదయ్ కుమార్ రెడ్డి పూర్తిగా పొంతనలేని సమాధానం ఇచ్చారు.

భవన నిర్మాణ సామాగ్రి  తేవడానికి వేకువజామున బస్టాండ్ కి వెళ్లానని,  ఆ సమయంలో ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి నుంచి ఫోన్ రావడంతో ఆయన ఇంటికి వెళ్లాను అని ఇంకోసారి సమాధానమిచ్చారు.  కాల్ డేటా రికార్డుల వివరాలు, టవర్ లొకేషన్ లో సమాచారం విశ్లేషించి చూస్తే ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలు నిజం కాదని తేలింది.  ఆయన కార్యకలాపాలన్నీ  సందేహాస్పదంగా, అనుమానాస్పదంగా  ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?