
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ , ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు మధ్య భూ వివాదంపై అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ మధురవాడలోని వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన నిర్మాణ కంపెనీపై ఇటీవల ఫిర్యాదులు రాగా.. మధురవాడలోని సర్వే నెంబర్ 225లో కాలువపై కట్టిన కల్వర్టు అక్రమ నిర్మాణంగా గుర్తించారు. ఈ మేరకు తొలగింపుకు ఆదేశాలు జారీ చేశారు. ఎండాడ సర్వే నెంబర్ 67లో చెరువు పొరంబోకు ఆక్రమణ జరిగినట్లు నిర్థారించారు.
సర్వే నెంబర్ 89లోని తాత్కాలిక నిర్మాణం గుర్తించి తొలగింపునకు ఆదేశాలు జారీచేశారు. ఎండాడ సర్వే నెంబర్ 67లో చెరువు పోరంబోకు ఆక్రమణలకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు అధికారులు. 10 సెంట్ల భూమిలో రోడ్డు, ఇతర నిర్మాణాలు వున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. భీమిలి రెవెన్యూ డివిజన్ అధికారులు విచారణ నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. వివాదాస్పద భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఉన్నాయని భీమిలి ఆర్.డి. ఓ. భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు ఇంటెలిజెన్స్ ఎస్పీ Madhuకు చెందిన స్థలాన్ని తాను కబ్జా చేయలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం MVV Satyanarayana మీడియాతో మాట్లాడారు. తాను ఎవరి భూమిని కబ్జా చేయలేదన్నారు. ఎస్పీ మధుతో పాటు మరో నలుగురు కలిసి 500 గజాల స్థలాన్ని ఎల్లపు ఈశ్వర్ వద్ద కొనుగోలు చేశారన్నారు. అయితే ఈ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎస్పీ ప్రయత్నిస్తున్న విషయాన్ని తనకు కొందరు సమాచారం ఇచ్చారన్నారు. అయితే ఈ విషయమై తాను పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు.
తన స్థలంలో గోడ నిర్మించుకొంటుంటే అడ్డుకొన్నారని తాను చెప్పానని ఎస్పీ మధు చెప్పారన్నారు. కానీ ఓ వర్గం మీడియాలో మాత్రం ఎంపీ ఈ భూమిని ఆక్రమించుకొంటున్నారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. స్వంత స్థలంలోనైనా ఏదైనా అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేయాలన్నారు.. కానీ ఎస్పీకి చెందిన భూమిలో కూడా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఎంపీ వివరించారు.
ప్రభుత్వ నిబంధనలను తాము కానీ, తమ సంస్థ కానీ ఉల్లంఘించలేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎస్పీ మధుకు ఈ భూమిని విక్రయించిన వ్యక్తి ఆయనను మోసం చేశారని విశాఖ ఎంపీ చెప్పారు. మధు కొనుగోలు చేసిన 500 గజాల స్థలంలో 300 గజాల భూమి వివాదంలో ఉందన్నారు. 150 గజాలకు ఎలాంటి ఇబ్బంది లేదని Revenue అధికారులు క్లియరెన్స్ ఇచ్చారని ఎంపీ వివరించారు.
అయితే ఎస్పీ మధు తన స్థలంలో గోడ నిర్మాణానికి సంబంధించి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే అర్ధరాత్రి గోడ నిర్మించేందుకు పూనుకోవడంతో పాటు అనుమతి లేకుండా గోడ నిర్మిస్తున్నారని తాను నిలిపివేయాలని అధికారులను కోరానని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. ఈ గోడ నిర్మించేంత వరకు ఈ స్థలం ఎస్పీ మధుది అనే విషయం తమకు తెలియదన్నారు. లేఔట్‌లో కూడా ఈ ప్రాంతాన్ని రోడ్డుగానే చూపారని ఎంపీ వివరించారు. రోడ్డు మధ్యలో ఎస్పీ స్థలం ఉందని ఇదంతా రోడ్డే అనుకొన్నామన్నారు.