
సామాజిక సమీకరణాల వల్లే మంత్రి పదవి ఇవ్వలేకపోయామని సీఎం చెప్పారని అన్నారు జగ్గయ్యపేట (jaggaiahpet mla) వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను (samineni udaya bhanu) . మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభానులు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు తనతో పాటు పనిచేసిన సీనియర్ నాయకులు కూడా మంత్రి పదవులు దక్కకపోవడంతో బాధపడిన వాస్తవమేనని అంగీకరించారు ఉదయభాను. రెండు రోజుల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న కార్యకర్తలను వారించినట్లు సామినేని చెప్పారు.
పార్థసారథి మచిలీపట్నానికి, తాను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే బలహీనవర్గాల కోటాలో పార్థసారథి.. తాను కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించామన్నారు. దీనిపై సీఎం కబురు చేయడంతో తాను , పార్థసారథి జగన్‌ను కలిసినట్లు సామినేని తెలిపారు. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత మీ అందరిపైనా వుందని సీఎం తమకు చెప్పారని ఆయన వెల్లడించారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఉదయభాను స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) దమ్ము, ధైర్యం వుంటే ఆయన పార్టీని బలోపేతం చేయాలంటూ దుయ్యబట్టారు. అది కాకుండా చంద్రబాబు చంకలో దూరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నాడంటూ సామినేని సెటైర్లు వేశారు. చంద్రబాబు (chandrababu) ఇచ్చే డబ్బుతో కొందరిని గెలిపించుకోవాలనే ఆలోచనే తప్ప.. తాను ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశం పవన్‌కు లేదని ఉదయభాను ఆరోపించారు. షూటింగ్‌లు లేనప్పుడు మధ్యమధ్యలో వస్తుంటాడని.. పవన్ పార్ట్‌టైం పొలిటిషియన్ అంటూ సెటైర్లు వేశారు. అలాంటి వ్యక్తిని ప్రజలు పట్టించుకోరని.. ఆయన వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని సామినేని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్ (kolusu parthasarathy yadav) మాట్లాడుతూ.. మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో తనకు బెర్త్ లభించకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు. పార్టీ శ్రేయస్సు , సామాజిక సమీకరణాల దృష్ట్యా బలహీన వర్గాలు, దళితులకు తగు ప్రాధాన్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జగన్ చెప్పారని పార్థసారథి అన్నారు. పార్టీ బలోపేతం కోసం కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు.