తొడలు కొట్టి.. మీడియాలో కనిపిస్తే నాయకులవుతారా .. దేవినేని ఉమా టార్గెట్‌గా కేశినేని కామెంట్స్

By Siva KodatiFirst Published Sep 29, 2022, 3:43 PM IST
Highlights

విజయవాడ టీడీపీలో నేతల మధ్య విభేదాలు ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమపై పరోక్షంగా కామెంట్స్ చేశారు ఎంపీ కేశినేని నాని. ఎక్కడో వుండి తొడలు కొట్టి మీడియాలో కనిపిస్తే నాయకులు కాలేరంటూ చురకలంటించారు. 
 

విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా గత కొన్నిరోజులుగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా వున్నారు ఎంపీ కేశినేని నాని. తనను కాదని తన సోదరుడికి ప్రాధాన్యత కల్పించడం, పార్టీ కార్యక్రమాలకు పిలుపు అందకపోవడంతో పాటు తనను పట్టించుకోవడం లేదనే అక్కసు నానిలో వుంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని మరోసారి బరస్ట్ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మాజీ మంత్రి దేవినేని ఉమపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. 

అందరినీ కలుపుకుని టీం టీడీపీ పేరుతో కార్యక్రమాలు చేస్తామని నాని చెప్పారు. అందులో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వారికే ప్రాధాన్యత వుంటుందని.. కమర్షియల్ నేతలను అంగీకరించే ప్రసక్తే లేదని, ఎక్కడో తొడలు కొట్టినంత మాత్రాన నేతలు కాలేరని ఆయన చురకలు వేశారు. నాయకులు ప్రజల్లో నుంచే బయటికి వస్తారని.. మీడియా నుంచి కాదని కేశినేని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కావాలనే సంకల్పంతో కలసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాకు నేనే గొప్ప అని వెళితే ప్రజల్లో పరాభవం తప్పదని.. అందరూ ఎవరి స్థాయిలో వారు పని చేసుకుంటూ వెళ్లాలని నాని అన్నారు. 

ALso REad:‘నా పేరు, హోదాను అక్రమంగా వినియోగిస్తున్నారు’... సోదరుడిపై ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు..

కాగా.. ఇటీవల విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నేతలంతా మండిపడ్డారు. ఈ క్రమంలోనే దేవినేని ఉమా తొడకొట్టారు... అలాగే గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఛాన్‌ఛార్జీ రావి వెంకటేశ్వరరావును కూడా వేదికపైకి పిలిచి తొడ కొట్టించారు. దీనిని టార్గెట్ చేస్తూనే కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా గుసగసలు వినిపిస్తున్నాయి. 

నిజానికి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కూతురు శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించేలా చేయడంలో కేశినేని నాని విజయం సాధించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసింది. అయితే పార్టీకి నష్టం జరగడానికి టీడీపీ నేతలు బోండా ఉమ, నాగుల్‌మీరాయే కారణమంటూ కేశినేని నాని ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా.. ఆయన చర్యలు తీసుకోలేదని గుర్రుగా ఉంటూ వస్తున్నారు నాని. అయితే ఇందుకు సంబంధించి కేశినేని నాని బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ.. మీడియా చిట్ చాట్‌లతో పాటు, తన సన్నిహితుల వద్ద కీలక కామెంట్స్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు తన సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారని భావిస్తున్న కేశినేని నాని అసంతృప్తి‌తో రగిలిపోతున్నారు. 
 

click me!