Nimmakayala Sriranganath: సీనియర్‌ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్ ఇక‌లేరు

Published : Feb 09, 2022, 10:29 AM IST
Nimmakayala Sriranganath: సీనియర్‌ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్ ఇక‌లేరు

సారాంశం

Nimmakayala Sriranganath: సీనియర్‌ పాత్రికేయుడు  నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (80) క‌న్నుమూశారు.  గ‌త‌ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.    

Nimmakayala Sriranganath: సీనియర్‌ పాత్రికేయుడు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్‌ (80) క‌న్నుమూశారు.  గ‌త‌ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శ్రీరంగనాథ్‌ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది.

శ్రీరంగనాథ్ గారు.. 1942, జనవరి7న తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లెలో జ‌న్మించారు. ఆయ‌న‌ అమలాపురంలోని ‘శ్రీకోనసీమ భానోజీ కామర్స్‌ కళాశాల’లో డిగ్రీ చేస్తున్న సమ‌యంలో.. వామపక్ష భావజాలానికి ప్రభావితులయ్యారు. ఈ భావజాలంతో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టారు. 

ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు తరిమెల నాగిరెడ్డి గ్రూపు రాజకీయ దృక్పథానికి సంబంధించిన రెండు తెలుగు పక్ష పత్రికలు, ఒక ఆంగ్ల మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.  ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రప్రదేశ్‌ టైమ్స్‌’ తదితర తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా పనిచేశారు.

తొలుత‌.. ఆయ‌న ఉదయం దిన పత్రిక లో కాకినాడ‌, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ ప్రాంతాల్లో స్టాఫ్‌ రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత ఉదయం స్టేట్‌ బ్యూరోలో కూడా ప‌ని చేశారు. ఆ త‌రువాత వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్‌ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్‌ నెట్‌ వర్క్‌ ఇన్‌ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా ప‌త్రిక రంగానికి సేవలందించారు. 
కమ్యూనిస్ట్‌ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ‘ఇండియా మార్ట్‌గేజ్‌’ పుస్తకాన్ని తెలుగులో ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో చేసిన అనువాదంలో  ఆయన పాలుపంచుకున్నారు.  

నీటిపారుదల రంగంపై ఆపార అనుభ‌వం కలిగిన ఆయ‌న  పోలవరం ప్రాజెక్టుపై ఒక ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు. శ్రీరంగనాథ్‌ భార్య లక్ష్మీకాంతం విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి.

ప్ర‌ముఖుల‌ సంతాపం

శ్రీరంగనాథ్‌ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.   మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. శ్రీరంగనాథ్ మ‌ర‌ణం.. పాత్రికేయ‌ రంగంలో తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జీవితాంతం బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని ఆచరిస్తూ.. నీటిపారుదల రంగంలో డెల్టా వ్యవస్థ మెరుగుదలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారని కొనియాడారు. ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డి..  శ్రీరంగనాథ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.  శ్రీరంగనాథ్‌ ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి అందించారని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu