
‘‘కేంద్ర పథకాల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఫొటో పెట్టాలి’’..తాజాగా భాజపా ఎంఎల్సీ సోము వీర్రాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ సారాంశం. ఇది చూసిన తర్వాత ఏం అర్ధమవుతోంది ? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దీనస్ధితిని స్పష్టంగా తెలియజేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న భాజపా చివరకు ‘‘కేంద్రప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల్లో అయినా ప్రధాని ఫొటోలు పెట్టండి బాబూ’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేబిరించుకునే పరిస్ధితికి దిగజారిపోయిందన్న విషయం స్పష్టమవుతోంది.
ఇంతకీ విషయమేంటి? మోడి మానసపుత్రిక ‘‘స్వచ్ఛ భారత్ మిషన్’’ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈనెల 15వ తేదీనుండి ‘‘స్వచ్ఛతే సేవ’’ పేరుతో పారిశుధ్య ప్రచార ఉద్యమం మొదలైంది లేండి. సరే, కేంద్ర పథకం కాబట్టి ప్రతీ రాష్ట్రమూ అమలు చేయాల్సిందే. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లాగే ఏపిలో కూడా ఉద్యమం మొదలైంది. అయితే, పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల్లో చంద్రబాబునాయుడు ఫోటోలు తప్ప నరేంద్రమోడి ఫొటోలుండటం లేదట. అది వీర్రాజు గారి బాధ.
వీర్రాజు ఓ విషయం మరచిపోయినట్లున్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న దాదాపు అన్నీ సంక్షేమ పథకాల్లోనూ కేంద్రం వాటా ఉంది. చౌకధరల దుకాణాలు, ఫించన్ల పంపిణీ, పేదలకు గృహనిర్మాణాలు..ఇలా చాలా పథకాలే ఉన్నాయి చెప్పుకోవాలంటే. పై పథకాల అమల్లో ఎప్పుడూ, ఎక్కడా చంద్రబాబు కేంద్రప్రభుత్వ భాగస్వామ్యం ఉందన్న విషయం చెప్పటంలేదు. 24గంటలూ విద్యుత్ ఇస్తున్నాను అనే చెబుతున్నారు. నిజానికి నిరంతర విద్యుత్ సరఫరా కూడా కేంద్రం చలవే. అయినా కేంద్రం ప్రస్తావన లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు సిఎం. అయినా వీర్రాజు అడగాలంటే చంద్రబాబునాయుడును నేరుగానే అడగాలి కానీ మధ్యలో ప్రధాన కార్యదర్శికి లేఖ రాయటమేంటి కామిడీగా.