ఆ ఘనత ఎన్టీఆర్, వైఎస్సార్, వంగవీటి రంగాదే...: Vangaveeti Ranga Vardhathi సభలో వల్లభనేని వంశీ

By Arun Kumar P  |  First Published Dec 26, 2021, 2:06 PM IST

దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 


విజయవాడ: ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్న నాయకులు, చిరకాలం గుర్తుండే వ్యక్తులు ముగ్గురే ముగ్గురు... వారు దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు (NTR),  వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) తో పాటు వంగవీటి మోహన రంగా (Vangaveeti Ranga) అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) పేర్కొన్నారు.  

దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా 33వ వర్ధంతి (vangaveeti vardhanthi) సందర్భంగా ఎమ్మెల్యే వంశీ తన మిత్రుడు, వంగవీటి రాధా (vangaveeti radha)ను కలిసారు. ఇద్దరూ కలిసి బెజవాడలోని  రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి రంగా విగ్రహానికి పూలమల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీ (janasena party) నాయకులు పోతిన మహేష్ కూడా పాల్గొన్నారు. తమ ప్రియతమ నాయకుడు రంగా వర్ధంతి సందర్భంగా రాధ ఇంటి వద్దకు అభిమానులు భారీగా చేరుకోవడంతో సందడి నెలకొంది.  

Latest Videos

undefined

ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ... గొప్ప నాయకుడు వంగవీటి రంగా బిడ్డలమని చెప్పడానికి తాము గర్వపడుతున్నామన్నారు. తండ్రి బాటలోనే వంగవీటి రాధ కూడా అంతే ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వంశీ పేర్కొన్నారు. 

read more  చంద్రబాబుకు షాక్ తప్పదా...? వంగవీటి రాధతో వల్లభనేని వంశీ భేటీ (వీడియో)

ఇక వంగవీటి రాధ మాట్లాడుతూ... వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నారు. గత 33సంవత్సరాలుగా నాన్న వర్ధంతిని ఆయన అభిమానులే జరపుతున్నారు. ఆయనపై ప్రజల అభిమానం చూసి తనకు చాలా సంతోషం వేస్తోందని రాధ పేర్కొన్నారు. గొప్ప ఆశయ సాధన కోసం పోరాడిన వ్యక్తి వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. 

జనసేన నాయకుడు పోతిన మహేష్ (pothina mahesh) మాట్లాడుతూ... దివంగత నేత వంగవీటి రంగా ప్రజలకు చేసినటువంటి సేవలు ఎప్పటికి మరువలేనివన్నారు. బడుగు బలహీనవర్గాల వారికి వంగవీటి రంగా ఎంతో సేవ చేసారన్నారు. అందుకే ప్రతి ఊరిలో వంగవీటి రంగా విగ్రహాలు వెలిసాయన్నారు. కృష్ణా జిల్లా (krishna district)లో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని పోతిన మహేష్ అక్కడేవున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజ్ఞప్తి చేసారు. 

ఇదిలావుంటే వల్లభనేని వంశీతో వంగవీటి రాధ కలవడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని (kodali nani) ని కలిసారు వంగవీటి రాధా. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకుని సరదాగా వున్నారు. కొద్దిసేపు మంత్రి నాని, రాధతో పాటు వైసిపి నాయకులు కొందరు ఓ గదిలో కూర్చుని మాట్లాడుకున్నారు. దీంతో వంగవీటి రాధ సొంతగూటికి (వైసిపి) చేరతారన్న ప్రచారం జరిగింది. 

అయితే ఆ ప్రచారాన్ని రాధ కొట్టిపడేసారు. తాను కేవలం ఫంక్షన్ లో పాల్గొనడానికి వెళ్లినట్లు... అక్కడ మంత్రి నాని కనిపిస్తూ పలకరించినట్లు వివరించాడు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని... వైసిపి శ్రేణులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాధ పేర్కొన్నారు. 

తాజాగా వల్లభనేని వంశీతో వంగవీటి రాధ భేటీ నేపథ్యంలోనూ గతంలో మాదిరిగానే ప్రచారం జరుగుతోంది. టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ అధికార వైసిపి పక్షాన చేరిన విషయం తెలిసిందే. తన మిత్రుడయిన రాధను కూడా తిరిగి వైసిపికి దగ్గర చేసేందుకే వంశీ ప్రయత్నిస్తున్నారని... అందులో భాగంగానే తాజాగా రాధను కలిసారని ప్రచారం జరుగుతోంది. తాజా ప్రచారంపై వంగవీటి రాధ ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!