
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు చంద్రబాబునాయుడు ప్రభుత్వం గాలి తీసేసారు. నిర్వాసితులకు మద్దతుగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వేదిక మీదనుండే పలువురు బాధితులు తమ సమస్యలను చెప్పుకొన్నారు. తమ భూములను తీసేసుకున్నా తమకు ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కాకపోతే తమ బ్రతుకుతెరువు కోసం న్యాయపరమైన, చట్ట ప్రకారం కల్పించాల్సిన లబ్దిని ఇవ్వాలంటూ డిమాండ్ చేయటం గమనార్హం.
తమ గ్రామాల్లో అభివృద్ధి పనులను కూడా సగం చేసి వదిలేస్తున్నట్లు ఆరోపించారు. ప్రతీ పనిని సగం సగమే చేసి వదిలేస్తున్నట్లు ధ్వజమెత్తారు. తమ భూములు లాక్కోవటంలో పెట్టిన శ్రద్ద తమకు పరిహారం అందించటంలో చూపలేదని మండిపడ్డారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ఐదేళ్ళల్లో ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భూములను తిరిగి రైతులకు వాపసు ఇచ్చేయాలన్నారు. కానీ సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్టు మాత్రం పూర్తి కావటం లేదని వాపోయారు.
నష్టపరిహారంగా ఇస్తామన్న యూత్ ప్యాకేజిని కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. 11 వేల నిర్వాసితులకు గాను ప్యాకేజి ఇస్తున్నది కేవలం వెయ్యిమందికేనంటూ ధ్వజమెత్తారు. తమ భూములైతే తీసుకున్నది కానీ నిబంధనల ప్రకారం యూత్ ప్యాకేజి పరిహారం అందుకోవటానికి అనర్హులమంటూ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. అటు భూములూ కోల్పోయి, ఇటు యూత్ ప్యాకేజీ అందక తామంతా రోడ్డుపై పడ్డామని ధ్వజమెత్తారు. నిర్వాసితులతో జగన్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రాబోయేది తమ ప్రభుత్వమేనన్నారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకొక్క ఏడాదిన్నర ఓపికపట్టాల్సిందిగా జగన్ కోరారు.