
అమెరికాలోని ‘తెలుగుతమ్ముళ్ళ’ మధ్య మొదలైన ఆధిపత్య గొడవలే చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనను వివాదాస్పదం చేస్తోందా? విశ్వసనీయవర్గాలు అవుననే సమాధానం చెబుతున్నయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి చంద్రబాబు పర్యటన విషయంలో అమెరికాలోని రెండు గ్రూపులు అత్యుత్సాహం చూపాయట. అందులో మొదటి గ్రూపేమో చంద్రబాబు పర్యటనల పేరు చెప్పి చందాలు వసూలు చేసే గ్రూపు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఆశక్తి చూపుతున్న అమెరికాలోని సంస్ధలతో చంద్రబాబు సమావేశాలు ఏర్పాటు చేసే రెండో గ్రూపు.
ఈ రెండు గ్రూపుల మధ్య మొదలైన ఆధిపత్య పోరాటాలే చంద్రబాబు పర్యటనను చివరకు రోడ్డున పడేట్లు చేసింది మాత్రం వాస్తవం. పెట్టుబడులు ఏమేరకు వస్తాయో తెలీదు గానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు పర్యటన వివాదాస్పదంమైంది. దాంతో రాష్ట్రం పరువు అమెరికా వీధుల్లో పడింది. చంద్రబాబు అమెరికాలో హాజరయ్యే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెయ్యి డాలర్ల ఫీజును నిర్ణయించింది. పేరుకేమో కార్యక్రమాల్లో పాల్గొనటం ఉచితం. కానీ చేసేదేమో 1000 డాలర్ల వసూళ్ళు.
చంద్రబాబు రాష్ట్రంలో ఉండగానే వసూళ్ళ కార్యక్రమం మొదలైంది. చంద్రబాబు పేరుచెప్పి మొదటి గ్రూపు భారీగా వసూళ్ళు చేసిందని సమాచారం. ఇక రెండో గ్రూపేమో పెట్టుబడుల వ్యవహారాలు చూసేది. మొదటి గ్రూపు సక్సెస్ అయినట్లుగా రెండో గ్రూపు సక్సెస్ కాలేదట. దాంతో చంద్రబాబు అమెరికాలో కాలుపెట్టిన దగ్గర నుండి రెండు గ్రూపులు ఒకదానికిపై మరోటి ఆధిపత్యం సాధించేందుకు పోటీలు పడుతున్నాయి. ఫలితంగా రెండు గ్రూపులు తాము రోడ్డున పడటమే కాకుండా రాష్ట్రప్రభుత్వ పరువును కూడా రోడ్డుమీదకు లాగేసాయి. ఈ రెండు గ్రూపుల్లో కూడా చంద్రబాబు దృష్టిలో పడటానికి ప్రయత్నం చేస్తున్నవారే అధికం.
చంద్రబాబు ప్రాపకం సంపాదించ గలిగితే చాలా తమ జన్మధన్యమైనట్లు భావించటం వల్లే సమస్యలు మొదలయ్యాయట. ఇందులో కూడా కమ్మ-కమ్మేతర సామాజికవర్గాల గొడవలూ సహజమే కదా? ఏదో పేరుచెప్పి చంద్రబాబుకు దగ్గరై రాష్ట్రంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమెరికాలో ఏదో ఒక పదవి సంపాదించుకోవాలన్న స్వార్ధమే ఇన్ని వివాదాలకు మూలకారణంగా తెలుస్తోంది. ఎందుకంటే, అమెరికాలో చంద్రబాబుతో సమావేశమవుతున్న వారిలో అత్యధికులు భారతీయలు లేదా రాష్ట్రానికి చెందిన వారే కావటం గమనార్హం.
రామాయణంలో పిడకల వేటలాగ చంద్రబాబుకు వ్యతిరేకంగా మెయిల్స్ ఇచ్చారన్న వివాదం ఇంకోటి. మెయిల్స్ ఇచ్చింది వైసీపీనే అని టిడిపి ఆరోపణలు చేసేస్తోంది. అందుకు ఆధారాలు బయటపడకపోయినా ఆరోపణలు మాత్రం గట్టిగా చేసేస్తోంది. ఈ వివాదంతో తరువాత వచ్చే పెట్టుబడుల సంగతేమొ గానీ ముందు పరువు మాత్రం పోతోంది.