
వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ సీటుపై నారా చంద్రబాబునాయుడు కుటుంబం కన్నేసిందా? పార్టీలోని సన్నిహితవర్గాలు అవుననే చెబుతున్నాయి. అందుకే చంద్రబాబునాయుడు పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా విశాఖపట్నం బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవలే లోకేష్ రెండు రోజులు విశాఖ జిల్లాలో పర్యటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ సీటులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా? అందుకే టిడిపి ముందుజాగ్రత్త పడుతోంది.
ఒకవేళ పొత్తున్నా లేకపోయినా విశాఖపట్నంలో నారా కుటుంబం పోటీ చేయటం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లే చంద్రబాబు అవసరమైన బేస్ ప్రిపేర్ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం విజయవాడ రాజధాని ప్రాంతంగా ఉన్నప్పటికీ ఆర్ధిక రాజధానిగా విశాఖే నిలుస్తోంది.
షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు అక్కడే ఏర్పాటైన దృష్ట్యా ఆర్ధిక అంశాల్లో విజయవాడకన్నా విశాఖపట్నమే ముందున్నది. భవిష్యత్తులో కూడా విశాఖపట్నానికే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న ఉద్దేశ్యంతో విశాఖపట్నం పార్లమెంటులో పాగా వేయటం ద్వారా మొత్తం ఉత్తరాంధ్రపై పట్టుసాధించాలన్నది నారా కుటుంబం ఆలోచనగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కూడా భాజపాతో పొత్తు ఉంటే ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలనే విషయంపైన కూడా చంద్రబాబు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఒకవేళ పొత్తుంటే భాజపా అభ్యర్ధిని విశాఖపట్నంకు బదులుగా అనకాపల్లి పార్లమెంటులో పోటీ చేయించేందుకు ప్లాన్ వేసారట. పొత్తు లేకపోతే అసలు సమస్యే లేదు.
చంద్రబాబు కూడా తరచూ విశాఖపట్నంకు వెళుతుండటం వెనుక ఇదే వ్యూహం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడు లోకేష్ కూడా అవకాశం ఉన్నపుడల్లా విశాఖ పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే, పార్లమెంట్ స్ధానంలో ఎవరు పోటీ చేస్తారన్నది మాత్రం సస్పెన్స్. లోకేష్ ను పోటీ చేయిస్తే ఎలాగుంటుంది? ఒకవేళ లోకేష్ సతీమణి బ్రాహ్మణి అయితే ఎలాగుంటుందని కూడా కుటుంబంలో చర్చ జరుగుతోందట. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కీలకమైన విశాఖపట్నం పార్లమెంట్ స్ధానంలో నారా కుటుంబం పాగా వేయటం ఖాయంగానే అనిపిస్తోంది.