
రాష్ట్రాభివృద్ధిలో ఏపీతో కలిసి పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (kishan reddy) పేర్కొన్నారు. విజయవాడ బెంజిసర్కిల్‌పై ఫ్లై ఓవర్ సహా.. రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు , ఇతర ప్రాజెక్ట్‌లను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఎయిర్ , పోర్ట్, సీ కనెక్టివిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన అనేక పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
వైద్య రంగానికి సంబంధించి అనేక పరికరాలు తయారుచేసే ప్రాంతంగా విశాఖ వృద్ధి చెందుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టాయిలెట్లు, వంటగ్యాస్ కనెక్షన్లు సహా పేదలకు ఆర్ధిక సహకారం అందిస్తున్నామన్నారు. కోవిడ్ పరిస్ధితుల్లోనూ ఇలాంటి సభ నిర్వహిస్తున్నామంటే దానికి వ్యాక్సినేషనే కారణమని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 175 కోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోందని .. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహిస్తోంది ఒక్క భారత్ మాత్రమేనని ఆయన చెప్పారు.
సీఎం జగన్ (ys jagan) ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతోందని.. 21 వేల కోట్లతో ఏపీలో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో 60 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని.. తెలంగాణలో కూడా రోడ్లు అత్యంత అభివృద్ధి చెందాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రోడ్, సముద్ర, వాయు కనెక్టివిటీ చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ అంటారని.. రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్షా లేదని ఆయన అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరుగుతోందని.. 7500 కోట్లతో 14 విద్యా సంస్ధలను నరేంద్రమోదీ (narendra modi) అభివృద్ధి చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.
శ్రీశైలం, సింహాద్రి, అన్నవరంలలో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నామని.. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ద్వారా అల్లూరి సీతారామరాజు మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని.. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు రాష్ట్రం, కేంద్రం నిర్వహిస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణాలో 32 జిల్లాలకు పూర్తిగా జాతీయ రహదారి కనెక్టివిటీ ఉంటోందని.. విజయవాడ చిన్నది కావడంతో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.