మాజీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకి కేంద్రం షాకిచ్చింది. ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి చార్జీషీట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ AB Venkateswara raoపై చార్జీషీట్ దాఖలు చేయాలని ఏపీ రాస్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. Chandrababu naidu ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు. ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం రూ.25.5 కోట్ల రూపాయలు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జగన్ సర్కార్ చెబుతుంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఏబీ వెంకటేశ్వరరావును suspend కూడా చేశారు.
దీనిపై కేంద్రానికి ఏబీ వెంకటేశ్వరావు అప్పీలు చేసుకొన్నారు. వెంకటేశ్వరరావు అభ్యర్థనను కేంద్ర హోం శాఖ తోసిపుచ్చింది. ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పేర్కొంది. వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారని వైసీపీ ఆరోపించింది. . 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017 లోనే ఓ పన్నాగం పన్నారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ‘ఆర్‌టీ ఇన్‌ఫ్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలు పాటించలేదని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టేలా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం సాగించారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది.ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కంపెనీకి భారతదేశంలో ఫ్రాంచైజీగా ‘ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణకు చెందిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ అడ్రస్‌తో ఈ కంపెనీని నెలకొల్పారు. ఇది ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సృష్టించిన షెల్ కంపెనీ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర నిబంధనలను ఉల్లంఘించారు. ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన ‘పర్చేజ్ ఆర్డర్’ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి మాయమైంది. అయితే ఈ ఆర్డర్ ను ఉద్దేశ్యపూర్వకంగానే మాయం చేశారనే ఏపీ ప్రభుత్వం అనుమానిస్తుంది.