పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేశారని ఆమె అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలను లోకేష్ ఖండించారు.
అమరావతి: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా Chandrababu Naidu ఉన్న సమయంలో పెగాసెస్ స్పై వేర్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు సర్కార్ Pegasus Spyware కొనుగోలు చేయలేదని గతంలో DGP గా పనిచేసిన Gautam Sawang స్పష్టం చేసిన విషయాన్ని మాజీ మంత్రి Ayyannapatrudu సమాచార హక్కు చట్టం కింద సేకరించిన పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందని బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు.గతంలో తమ రాష్ట్ర పోలీస్ శాఖను ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయాలని సాఫ్ట్ వేర్ ప్రతినిధులు సంప్రదించారని ఆమె గుర్తు చేశారు. అయితే అప్పటికే ఈ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని తమకు తెలిసిందని అసెంబ్లీ వేదికగా ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై TDP జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐటీ శాఖ మంత్రి Nara Lokesh స్పందించారు. పెగాసెస్ స్పై వేర్ ను తాము కొనుగోలు చేసి ఉంటే రాష్ట్రంలో గత ఎన్నికల్లో YCP అధికారంలోకి వచ్చి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్టే పెగాసెస్ స్పై వేర్ ను కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు తమ ప్రభుత్వాన్ని కూడా అప్పట్లో సంప్రదించారన్నారు. కానీ తాము ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని లోకేష్ తేల్చి చెప్పారు అయితే బెంగాల్ సీఎం ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తనకు తెలియదన్నారు. అయితే బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలను చేయడం వెనుక ఆమెకు తప్పుడు సమాచారం అంది ఉంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరో వైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు సంబంధించిన అంశాలను వైసీపీ సర్కార్ పరిశీలించిందని లోకేష్ గుర్తు చేశారు.
ఈ వివాదంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా స్పందించారు. గౌతం సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేశారా అనే విషయమై సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచార పత్రాన్ని అయ్యన్నపాత్రుడు విడుదల చేశారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాలను కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ సాగుతుంది. ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును ఇంటలిజెన్స్ చీఫ్ పదవి నుండి తప్పించింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు. వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో ఫిరాయించడానికి ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారని వైసీపీ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తలెిసిందే.