
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడల మధ్య నడిచిన డబుల్ డెక్కర్ ట్రైన్‌కు ప్రత్యేక ఆదరణ ఉండేది. కరోనా కారణంగా ఈ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపేశారు. కానీ, ప్రయాణికుల నుంచి డిమాండ్లు రావడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే మళ్లీ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం ఈ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు మళ్లీ ప్రారంభించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని గ్రూప్ డీ స్టాఫ్ జెండా ఊపీ ఈ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ , ఆపరేటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆర్‌పీఎఫ్ వంటి డిపార్ట్‌మెంట్‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
డబుల్ డెక్కర్ ట్రైన్ నెంబర్ 22701 విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లుతుంది. ఈ ట్రైన్ సోమ, మంగళ, బుధ, శుక్ర, శని వారాల్లో అందుబాటులో ఉండనుంది. ఉదయం 5.25 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరితే.. ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, అదే రూట్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి డబుల్ డెక్కర్ ట్రైన్ నెంబర్ 22702 ప్రయాణించనుంది. అది కూడా సోమ, మంగళ, బుధ, శుక్ర, శని వారాల్లో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ట్రైన్ సాయంత్రం 5.30 గంటలకు
విజయవాడ నుంచి బయల్దేరుతుంది. రాత్రి 10.55 గంటల ప్రాంతంలో విశాఖపట్నానికి చేరుతుంది.