
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గ్యాంగ్ వార్స్ నిత్యకృత్యంగా మారాయి. గతేడాది ఓ భూ వివాదంలో రెండు వర్గాల మధ్య గొడవలో సందీప్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి గ్యాంగ్ వార్ మళ్లీ విజయవాడలో జరిగింది.రెండు వర్గాల మధ్య ఏళ్ళుగా సాగుతున్న గొడవలు మరింత ముదిరి స్ట్రీట్ ఫైట్ కు దారితీసింది. గంజాయి, మద్యం మత్తులో రెండు వర్గాలు కత్తులు, రాడ్లతో పరస్పర దాడులకు దిగడంతో ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు.ఈ గ్యాంగ్ వార్ తో మరోసారి విజయవాడలో శాంతిభద్రతలపై చర్చ మొదలయ్యింది.
వివరాల్లోకి వెళితే... విజయవాడలోని చిట్టినగర్ కటిక మస్తాన్ వీధి, బ్రహ్మంగారిమఠం వీధికి చెందిన పాత దుస్తుల వ్యాపారుల మధ్య కొన్నేళ్ళుగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ వర్గానికి చెందిన దుర్గేష్ పై మరో వర్గానికి చెందిన గని, గాలిబ్ మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాల పరస్పరం దాడులు చేసుకుని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రెండు గ్రూపులకు చెందిన కొందరిని అరెస్ట్ చేసారు.
అయితే ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి గొడవలు ఆపడానికి అధికార వైసిపి నాయకుడి బంధువు హరి ప్రయత్నించాడు. ఇరు వర్గాలను స్థానిక వైసిపి కార్యాలయం వద్ద పంచాయితీకి పిలిచాడు. దీంతో గని, గాలీబ్ గ్యాంగ్ తో పాటు దుర్గేష్ గ్యాంగ్ అక్కడికి చేరుకుంది. అయితే పంచాయితీకి పిలిచిన హరి ప్రత్యర్థి వర్గానికి చెందనవాడని దుర్గేష్ వర్గం గుర్తించింది. దీంతో అప్పటికే గంజాయి, మద్యం మత్తులో వున్న ఇరువర్గాలు అక్కడే పరస్పర దాడులకు దిగారు.
Read More కానిస్టేబుళ్ల మీద సుత్తితో దాడి చేసిన తాగుబోతు.. ఒకరి పరిస్థితి విషమం..
కత్తులు, రాడ్లతో పాటు పదునైన ఆయుధాలతో రెండు గ్యాంగ్ లు వీధుల్లోకి చేరి గొడవపడ్డారు.ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందినవారు గాయపడగా... అఖిల్, శ్రీనివాస్ రెడ్డి లకు కత్తిపోట్లకు గురయి తీవ్రంగా గాయపడ్డారు. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు, మిగతావారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ స్ట్రీట్ ఫైట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ గ్యాంగ్ వార్ తో విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది.వీధుల్లోకి చేరి అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో హల్ చల్ చేస్తున్నవారిని చూసి ప్రజలు భయపడిపోతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని... మళ్లీ ఇలాంటి గొడవలకు జరక్కుండా చూడాలని కోరుతున్నారు.