
విజయనగరం: రోడ్డుపక్కన ఆగివున్న ట్రాక్టర్ ను అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టిన ఘోర ప్రమాదం విజయనగరం జిల్లాలో (vijayanagaram district) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కొంకిడివరం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సోమవారం రాత్రి నానో కారులో బయలుదేరారు. అయితే వీరు పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వెళుతూ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది.
Video
రోడ్డుపక్కన నిలిపివున్న ట్రాక్టర్ ను కారు ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు ముందుసీట్లోని మరో వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
read more Vikarabad SI : పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ మృతి
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ముందుగా క్షతగాత్రుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసారు. అంబులెన్స్ లో గాయపడిన ఇద్దరినీ పార్వతీపురం ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందేలా చూసారు. అయితే తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ప్రమాదానికి గురయిన కారు నుజ్జునుజ్జయ్యింది. ట్రాక్టర్ వెనకబాగం స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై వుంటుందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
ఇదిలావుంటే నూతన సంవత్సరం రోజున విశాఖపట్నం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదానికి ముగ్గురు యువకులు బలయ్యారు. రెండు బైక్ లు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్ పెద్దగదిలి దగ్గర శనివారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇక తెలంగాణలోనూ నూతన సంవత్సరం ప్రారంభంరోజే ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం దిడ్గీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది.
అతివేగంతో వచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటు, వారి పాప మృతిచెందింది. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతిచెందాడు. మృతిచెందిన వారు బాలరాజు(28), శ్రావణి (22), వారి కూతురు అమ్ములు (8 నెలలు), గా గుర్తించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బాచుపల్లి. మరోవైపు కారులో ప్రయాణిస్తు మృతిచెందిన వ్యక్తిని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరుకు చెందిన ఫరీద్(25) గా గుర్తించారు.