నరసరావుపేట యువకుడు మిస్సింగ్ కేసులో.. ‘దృశ్యం’ స్టోరీ తలపించే మలుపులు..అసలు విషయం ఏంటంటే...

By SumaBala BukkaFirst Published Nov 22, 2022, 9:31 AM IST
Highlights

నరసరావుపేటలో నిరుడు కనిపించకుండాపోయిన ఓ యువకుడి కేసులో కొత్త మలుపు తిరిగింది. కేరళలో నగల దొంగతనాలు చేసి.. నరసరావు పేటలో మార్పిడి చేసుకునే క్రమంలో అదృశ్యం జరిగిందని తెలుస్తోంది. 

పల్నాడు జిల్లా :  పల్నాడు జిల్లా, నరసరావుపేటలో ఓ మిస్సింగ్ కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు ఓ తెలుగు క్రైం సినిమాను తలదన్నేలా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలుకు చెందిన జంగం చంటి (28) అనే వ్యక్తి.. నిరుడు సెప్టెంబర్ 16న కనిపించకుండా పోయాడు. దీనిమీద అతని అన్న బాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అదే ఏడాది అక్టోబరు 24న నాదెండ్ల పోలీస్స్టేషన్లో ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదయ్యింది. 

అయితే, రోజులు గడుస్తున్నా.. ఎంతకీ తమ్ముడి ఆచూకీని పోలీసులు కనుక్కోలేకపోయారు. దీంతో బాజీ స్వయంగా తమ్ముడిని వెతకడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా, కనిపించకుండా పోయిన చంటీ దాచేపల్లికి చెందిన నాగూర్ అలియాస్ బిల్లా, నరసరావుపేట మండలం కేసానుపల్లి వాసి రావిపాటి వెంకన్నలతో కలిసి చోరీలకు పాల్పడుతుండేవాడు. అలా దొంగిలించిన బంగారాన్ని నరసరావుపేటలోని ఓ నగల దుకాణం మార్చి.. డబ్బులు చేసుకునేవారు. దీనికోసం ఆ నగల దుకాణం ఉద్యోగి, జొన్నలగడ్డ నివాసి సిరివేరు రామాంజనేయులు సాయం తీసుకుంటుండేవారు. ఈ మేరకు వీరిమీద  ఆరోపణలు ఉన్నాయి. 

దాంతో తమ్ముడు కనిపించకపోవడంలో వీరి ప్రమేయం ఉందేమోనన్న అనుమానంతో బాజి.. ఈ ఏడాది ఏప్రిల్ 22న రామాంజనేయులును కిడ్నాప్ చేశాడు. అతడి వద్దనుంచి నిజం రాబట్టే క్రమంలో నాదెండ్ల-ఎడ్లపాడు మధ్య వాగులో ముంచాడు. ఈ క్రమంలో అతడు చనిపోయాడు. ఇది పోలీసులకు తెలిసింది. అలా రామాంజనేయులు హత్య కేసులో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు హాజరైన బాజీ.. తిరిగి వెళుతుండగా.. అతనిమీద గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో బాజీ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 

బిందెలో ఎలుక పడిన కలుషిత నీటిని తాగి.. ఆరేళ్ల బాలుడి మృతి..!

తనమీద హత్యాయత్నం జరిగిందని బాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానంతో పోలీసులు రావిపాటి వెంకన్న, బిల్లాలతో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. కేరళలో సెప్టెంబర్లో వీరంతా కలిసి కొంత బంగారాన్ని దొంగిలించారు. ఆ బంగారు నగలు అమ్మే బాధ్యతను వెంకన్న, బిల్లాలు చంటికి అప్పగించారు. అయితే, ఆ తర్వాత డబ్బు విషయం అడిగితే చంటి నుంచి స్పందన లేదు. దీంతో వీరిద్దరూ కోపానికి వచ్చారు. 

డబ్బుల కోసం చంటిని విజయవాడలోని ఓ లాడ్జిలో బంధించారు. అతడిని చిత్రహింసలు పెట్టారు. వాటిని తట్టుకోలేక చంటి చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ గేట్ దగ్గర పూడ్చి పెట్టారు. అయితే, ఏప్రిల్ 22న అనుకోకుండా చంటి అన్న బాజీ చేతుల్లో రామాంజనేయులు హత్యకు గురికావడంతో షాక్ అయ్యారు. బాజీ తమను కూడా హతమారుస్తాడని భయపడ్డారు. అందుకే అతడిని చంపాలని హత్యాయత్నం చేశారు. 

ఈ మేరకు విచారణలో నిందితులు తెలిపారు. ఈ సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ జి.విజయభాస్కరరావు, చిలకలూరిపేట గ్రామీణ సిఐ వై. అచ్చయ్య, ఎస్సైలు ఏ భాస్కర్, వి బాలకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసు బృందం బొమ్మలూరులో మృతదేహం కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒకచోట అనుమానించి తవ్వారు. అక్కడ కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాం లభ్యమయ్యింది. ఆ మృతదేహం మీదున్న మొలతాడు, తాయత్తు, మరికొన్ని ఆనవాళ్లను చూసి కుటుంబ సభ్యులు అతడిని చంటిగా గుర్తించారు. వైద్యులు మృతదేహానికి అక్కడే శవ పరీక్ష నిర్వహించారు. డీఎన్ఏ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించారు. చంటికి భార్య కౌసల్య, మూడేళ్ల లోపు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రావిపాటి వెంకన్న, బిల్లాలతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వివరాలు నాదెండ్ల ఎస్సై భాస్కర్ తెలిపారు. 

click me!