అల్లరి మూక.. జనసేనకు ఓ విధానం లేదు : విశాఖలో దాడి ఘటనపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం

By Siva KodatiFirst Published Oct 15, 2022, 7:23 PM IST
Highlights

విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. విజయవాడలో దిగిన తర్వాత ఈ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. 
 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడి చేయడంపై స్పందించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారని.. ఆ పార్టీకి విధి విధానమంటూ ఏం లేదని ఆయన మండిపడ్డారు. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైవీ. విశాఖ అభివృద్ధిని టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. 

అంతకుముందు మంత్రి జోగి రమేశ్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. జనసేనది చిల్లర వ్యవహారమని.. మాపై దాడి చేస్తే ఏం వస్తుందని జోగి రమేశ్ ప్రశ్నించారు. అరాచకవాదులందరినీ పవన్ చేరదీస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని చూసి కవ్వించే కార్యక్రమాలకు జనసేన కార్యకర్తలు దిగారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ అనే తమ కార్యకర్తని చావబాదారని.. రక్తం కారుతున్నా వదల్లేదని జోగి రమేశ్ అన్నారు. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు. 

ALso REad:అరాచక శక్తులే ఇలా .. నీ వాళ్లని అదుపులో పెట్టుకో : విశాఖ దాడిపై పవన్‌కు జోగి రమేశ్ హెచ్చరిక

ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. 

అసలేం జరిగిందంటే:

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. 

click me!