
విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ నేతలు జోగి రమేశ్, వైవీ సుబ్బారెడ్డి, రోజాలపై జరిగిన దాడి ఘటనపై స్పందించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పవన్ కల్యాణ్ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. జనసేన కార్యకర్తలు దాడి చేశారని చెప్పడం విడ్డూరంగా వుందని నాదెండ్ల విమర్శించారు. దాడులను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని మనోహర్ స్పష్టం చేశారు. మంత్రుల మీద దాడి జరిగితే వాళ్లకు రక్షణగా వున్న పోలీసులు ఏం చేస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు.
ALso REad:‘‘ రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ విశాఖ’’ .... మీరు చేసేదేంట్రా బాబు : వైసీపీకి నాగబాబు చురకలు
అంతకుముందు మంత్రి జోగి రమేశ్ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. జనసేనది చిల్లర వ్యవహారమని.. మాపై దాడి చేస్తే ఏం వస్తుందని జోగి రమేశ్ ప్రశ్నించారు. అరాచకవాదులందరినీ పవన్ చేరదీస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని చూసి కవ్వించే కార్యక్రమాలకు జనసేన కార్యకర్తలు దిగారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ అనే తమ కార్యకర్తని చావబాదారని.. రక్తం కారుతున్నా వదల్లేదని జోగి రమేశ్ అన్నారు. జనసేన కార్యకర్తల్ని పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని.. ఇలాంటి ఘటన మరోసారి జరిగితే ఊరుకునేది లేదని జోగి రమేశ్ హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే:
వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు.