భక్తులు భారీగా వస్తారని ఊహించాం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం: టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

Published : Apr 13, 2022, 02:09 PM IST
 భక్తులు భారీగా వస్తారని ఊహించాం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం: టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

సారాంశం

తిరుమలలో రోజుకు 80 వేల మంది దర్శనం చేసుకునే వీలుందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో ఇచ్చినా సమస్యలు వచ్చాయని చెప్పారు. 

తిరుమలలో రోజుకు 80 వేల మంది దర్శనం చేసుకునే వీలుందని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో ఇచ్చినా సమస్యలు వచ్చాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని భక్తులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధర్మారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. 43 రోజులుగా పూర్తి స్థాయిలో శ్రీవారి సేవలు, దర్శనాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత క్రమంగా భక్తుల సంఖ్యను పెంచినట్టుగా చెప్పారు. సామాన్య భక్తులు వీఐపీ భక్తుల తరహాలోనే.. స్వామివారి దర్శనం చేసుకునేందుకు స్లాటెడ్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. 

మొత్తం మూడు కౌంటర్లు కలిపి 18 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చారని చెప్పారు. టోకెన్లు దొరకవనే ఆతృతతో క్యూలైన్‌లో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కౌంటర్లు మూసివేశామని.. అక్కడికే తిరుమల బస్సులను పంపించామని చెప్పారు. ప్రస్తుత విధానంతో భక్తులు కంపార్ట్‌మెంట్లతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

భక్తులకు అల్పాహారం, భోజనం..చిన్నారులకు పాలు అందిస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని దూరం కానివ్వబోమని ధర్మారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఏప్రిల్ 30లోగా పున: ప్రారంభిస్తామని చెప్పారు. భక్తుల కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ముందుగానే వైకుంఠం-2 కాంప్లెక్స్‌ను సిద్దం చేశామని చెప్పారు. ముందస్తుగానే పరిస్థితిన ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తమపై ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక, మంగళవారం సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని కౌంటర్‌ల వద్ద క్యూలైన్లలో వేచిఉన్న భక్తలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం కౌంటర్లు తెరిచే సమయానికి అలిపిరి లింక్ బస్ స్టేషన్ సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లోని టోకెన్ కౌంటర్‌ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలలో నెట్టుకోవడం, తోపులాట చోటుచేసింది. తిరుపతిలో మిగిలి రెండు సర్వ దర్శనం కౌంటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

ఎండ తీవ్రతలోనే భక్తులు గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. వేలాదిగా తరలివచ్చినా భక్తులు తాగునీటి సౌకర్యం కూడా లేదు. ఇక, టోకెన్లు పొందాలనే ఆతృతలో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళా భక్తులు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వారిని బంధువులు.. గాలి ఆడే ప్రదేశాలకు తరలించారు. పిల్లలు గుక్కపట్టి ఏడ్చారు. ఈ తోపులాటలో ముగ్గురిని గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే మూడు ఉచిత దర్శనం టోకెన్ కౌంటర్లను తక్షణమే మూసివేసిన టీటీడీ.. మంగళవారం నుంచి భక్తులను గతంలో మాదిరిగానే తిరుమలకు అనుమతిస్తామని ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!