
Today’s News Roundup 26 th August 2025:
ప్రధాని మోదీ డిగ్రీపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. డీయూ (Delhi University) పై సీఐసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు, డిగ్రీ, మార్కులు, జవాబు పత్రాలు అన్నీ వ్యక్తిగత సమాచారం కిందకే వస్తాయని పేర్కొంది. ప్రజలకు ఆసక్తి ఉండటం, ప్రజా ప్రయోజనంగా పరిగణించరాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పదవులకు విద్యార్హతలు తప్పనిసరి కాదని కూడా న్యాయస్థానం గుర్తుచేసింది.
ఇక ఈ తీర్పుపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధారణ ప్రజల డిగ్రీలు, విద్యార్హతలు అందుబాటులో ఉన్నప్పుడు ప్రధాని డిగ్రీ ఎందుకు రహస్యంగా ఉంచాలన్నది వారి ప్రశ్న. ఈ నిర్ణయం అసమగ్రమని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి విద్యా వివరాలు ప్రజలకు తెలిసే హక్కు ఉందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని, రాష్ట్ర ఉద్యమానికి ఇది పురిటిగడ్డ అని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి మహానేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారేనని వివరించారు. యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూకి తొలిసారిగా దళితుడిని వీసీగా నియమించామన్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని, ఇది సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు. చదువే యువతను గుణవంతులు, ధనవంతులు చేస్తుందని, తప్పు నిర్ణయాలను వ్యతిరేకించి నిరసన తెలపాలని విద్యార్థులకు సూచించారు. డిసెంబర్‌లో తిరిగి ఓయూకి వస్తానని, ఆ సమయంలో క్యాంపస్‌లో ఒక్క పోలీస్ కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. "సమస్యలు పరిష్కరించడానికి వచ్చే వారిని అడ్డుకోవద్దు… కానీ విద్యార్థుల నిరసన హక్కును అడ్డుకోకూడదు" అని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి – 2026 నాటికి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోర్టులను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. అలాగే ఒడిశాలో డ్రైపోర్టులు నిర్మించి వాటిని నేరుగా ఏపీ పోర్టులకు కలిపి సేవలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. సముద్రతీరంలో ప్రతి 50 కి.మీ.లకో పోర్టు, వాటి ఆధారిత పరిశ్రమలతో కలిపి మొత్తం 20 పోర్టులు అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆలోచన.
ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణం ఇప్పటికే 69 శాతం పూర్తయి, 2025 జూన్ నాటికి ప్రారంభించాలన్న ప్రణాళిక ఉంది. అయితే కేప్ సైజు నౌకల రాక కోసం డ్రెడ్జింగ్ లోతును 16 మీటర్ల నుంచి 18.5 మీటర్లకు పెంచితే గడువు పొడగవచ్చు. మొదటి దశలో నాలుగు బెర్తులు నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకటి పూర్తయింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోర్టు పనులు 45.5 శాతం పూర్తయ్యాయి. ఇది 2026 నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
Phytosaur: రాజస్థాన్‌లో బయటపడ్డ 201 మిలియన్ ఏళ్లనాటి శిలాజం
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా మేఘా గ్రామంలో 201 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ఫైటోసార్ శిలాజం వెలుగులోకి వచ్చింది. ఇది డైనోసార్ల కంటే పురాతనమైన సరీసృపంగా, దాదాపు పూర్తి అస్థిపంజరం కనుగొన్నదనే ప్రత్యేకత ఉంది. గ్రామస్థుల సమాచారంతో అధికారులు ఈ శిలాజాన్ని గుర్తించి, సీనియర్ భూగర్భ శాస్త్రవేత్తలు ప్రాథమిక పరిశీలన జరిపారు.
జేఎన్‌వీయూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డీన్ డాక్టర్ వి.ఎస్. పరిహార్ నేతృత్వంలో బృందం లోతైన అధ్యయనం ప్రారంభించింది. ఫైటోసార్ పొడవు 1.5–2 మీటర్లు, మొసలి ఆకారంలో ఉండి ఆధునిక మొసళ్లతో పోలికలు కలిగిన జీవి. ప్రస్తుతం శిలాజం చుట్టూ రక్షణ ఏర్పాటుచేసి, జీఎస్‌ఐ తవ్వకాలు చేపట్టి సమగ్ర అధ్యయనం చేపడుతుంది. జైసల్మేర్ ప్రాంతం ప్రాచీన జీవుల శిలాజాలకు ప్రసిద్ధి, గతంలో డైనోసార్ల పాదముద్రలు, చెట్ల శిలాజాలు లభించాయి.
కేజీఎఫ్' నటుడు దినేశ్ మంగళూరు మృతి.. కన్నడ సినీ పరిశ్రమలో విషాదం
పాన్ ఇండియా హిట్ 'కేజీఎఫ్' చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు దినేశ్ మంగళూరు (55) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఉడుపి జిల్లా కుందాపురలో బ్రెయిన్ హెమరేజ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన దినేశ్, మొదట ఆర్ట్ డైరెక్టర్‌గా 'ఆస్ఫోట', 'చంద్రముఖి ప్రాణసఖి' వంటి చిత్రాల్లో పని చేశారు. తరువాత 'ఆ దినగళు', 'కిచ్చా', 'కిరిక్ పార్టీ', 'ఉళిదవారు కండాంతె' వంటి సినిమాలలో నటన ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. 'కేజీఎఫ్ చాప్టర్ 1', 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో ముంబై డాన్, గోల్డ్ స్మగ్లర్ పాత్రలకు మంచి ప్రశంసలు దక్కాయి. దినేశ్‌కు భార్య భారతి పాయ్, ఇద్దరు కుమారులు సూర్య సిద్ధార్థ, సజన్ పాయ్ ఉన్నారు. సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Dream11 టీమిండియా స్పాన్సర్‌షిప్ నుండి ఎగ్జిట్.. రూ.358 కోట్లు ఒప్పందం మధ్యలో రద్దు
భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11, టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్ ఒప్పందం (రూ. 358 కోట్లు) నుంచి మధ్యలోనే వైదొలిగింది. అయితే, కొత్తగా అమలులోకి వచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కారణంగా, ఒప్పందం రద్దు చేసినప్పటికీ బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు.
డ్రీమ్ 11 ప్రతినిధులు తమ నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసారు. ఒప్పందంలోని ప్రత్యేక క్లాజ్ ప్రకారం, కొత్త చట్టం కారణంగా వ్యాపారంపై ఆటంకం ఉన్నా, స్పాన్సర్‌షిప్ నుంచి ఎలాంటి నష్టపరిహారం లేకుండా తప్పుకోవచ్చు. 2023లో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది.
ఈ పరిణామం బీసీసీఐకు మాత్రమే కాకుండా, క్రికెట్ ప్రపంచంపై కూడా ప్రభావం చూపనుంది. డ్రీమ్ 11 ఐపీఎల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, న్యూజిలాండ్ డొమెస్టిక్ టీ20 లీగ్‌లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ త్వరలో టెండర్లు పిలుస్తుందని వెల్లడించింది.