
AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (DSC) నియామక ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25, 2025న సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కావాల్సింది. అసలేం జరిగిందంటే?
వాస్తవానికి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా, కాల్ లెటర్ల పంపిణీ ఆలస్యమవడంతో పరిశీలనను ఒక రోజు వెనక్కి త్రోసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆగస్టు 26, 2025కి వాయిదా వేశారు. ఇప్పటికే డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల అయింది, పరీక్షల్లో సాధించిన స్కోర్ల ఆధారంగా అర్హులైన అభ్యర్థుల ర్యాంకులు కేటాయించబడ్డాయి.
సర్టిఫికెట్ పరిశీలన అనంతరం మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల రెండో వారంలో పాఠశాలల్లో చేరేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కొన్ని పరీక్షల్లో అక్రమాలు గుర్తించారు. ఉదాహరణకు, ఒక అభ్యర్థి టెట్‌లో తెలుగు రాయగా, డీఎస్సీలో ఉర్దూ రాసిన కేసులు వెలుగులోకి వచ్చాయి. మరికొందరు సబ్జెక్టు సరిపోలకుండా రాసిన అభ్యర్థుల ఫలితాలు నిలిపివేయబడ్డాయి. అలాగే, అర్హత పరీక్షలు పూర్తి చేయకముందే డీఎస్సీకి హాజరైన అభ్యర్థులు కూడా బయటపడ్డారు.
డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేయబోతున్నారు. ఇందుకోసం మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, వీరిలో 92.90 శాతం హాజరయ్యారు. జూన్ 6 నుండి జులై 2 వరకు 23 రోజులపాటు పరీక్షలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశారు.