ఉపరితల ఆవర్తనం... నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

By Arun Kumar PFirst Published 29, Sep 2020, 7:35 AM
Highlights

ఇవాళ(మంగళవారం) రాయలసీమలో, రేపు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

విశాఖపట్నం: దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ(మంగళవారం) రాయలసీమలో, రేపు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుండగా... తాజాగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 3,52,579 వుండగా అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులుగా వుంది. 

ఈ నేపథ్యంలోనే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని... వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం  లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు. 

read more   పొంచివున్న ప్రమాదం... చంద్రబాబును హెచ్చరించిన అధికారులు
 
మరోవైపు ఈ వర్షాల కారణంగా కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు కూడా భారీ వరద కొనసాగుతోంది. గండికోట జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 16.5 టీఎంసీలుగా వుంది. అంతకంతకు నీటి నిల్వ పెరుగుతుండటంతో ముంపు గ్రామమైన తాళ్ల పొద్దుటూరు, కొండాపురం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఎస్సీ కాలనీ నీట మునిగింది. దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరో తెలుగు రాష్ట్రమయిన తెలంగాణలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద  కొనసాగుతోంది.దీంతో మొత్తం 20 క్రస్టుగేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10గేట్లు 15ఫీట్ల మేర, 10గేట్లు 10ఫీట్ల మేర ఎత్తారు అధికారులు.  ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో కూడా 4,10,978 క్యూసెక్కులుగా వుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ312.0450 టీఎంసీలుగా వుంది.  
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 29, Sep 2020, 7:45 AM