నష్టపరిహారం కోసం హైకోర్టుకెక్కిన సినీ నటుడు కృష్ణంరాజు

By telugu teamFirst Published 29, Sep 2020, 7:10 AM
Highlights

గన్నవరం విమానాశ్రయం కోసం తన భూమిని సేకరించిన ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఆ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఇదిలావుంటే, అమరావతి భూములపై ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి 39 ఎకరాలు ఇచ్చినట్లు ఆయన పిటిషన్ లో తెలిపారు. ఎకరానికి కోటీ 54 లక్షల విలువ చేసే భూమి అది అని చెప్పారు. 

ఆ భూమికి సరిసమానమైన, అంతే విలువ కలిగిన భూమిని తనకు రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డిఎ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఇప్పుడు రాజధానిని ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలించడానికి నిర్ణయించనందని, దాంతో అక్కడి భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా చేయని స్థితికి వచ్చిందని ఆయన చెప్పారు. 

తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ. 210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, విమానాశ్రయం అథారిటీని పార్టీలుగా చేస్తూ అశ్వినీదత్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి రూ. కోటీ 84 లక్షలకు చేరుకుందని ఆయన చెప్పారు. 

భూసేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చునని ఆయన చెప్పారు. అశ్వినీదత్ తరఫును న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 29, Sep 2020, 7:10 AM