Latest Videos

తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై.. మంత్రులైంది వీరే

By Galam Venkata RaoFirst Published Jun 12, 2024, 11:35 AM IST
Highlights

చంద్రబాబు 4.0 సర్కార్ లో ఆ ఎమ్మెల్యేలు చాలా స్పెషల్. ఎందుకంటే.. అసెంబ్లీలో అడుగు పెట్టకముందే మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. పవన్ కల్యాణ్ సహా 10 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై... చంద్రబాబు కేబినెట్లో పదవులు దక్కించుకున్నారు. వారి గురించి తెలుసుకుందామా..  

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 164 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. పలువురు తొలిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి.. రికార్డు స్థాయి మెజారీతో గెలుపొందారు. అలా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొంది చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా పదవులు దక్కించుకున్నది వీరే....

చంద్రబాబు కేబినెట్‌లో 24 మందికి అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌ సహా ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి 21 మందితో కొత్త మంత్రివర్గం సిద్ధమైంది. అయితే, చంద్రబాబు కేబినెట్‌లో 17 మంది కొత్తవారే కావడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ సహా 16 మంది తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక పలువురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై... అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే కేబినెట్‌లోకి స్థానం సంపాదించుకున్నారు. అంచనాలకు మించి తక్కువ మంది సీనియర్లకు కేబినెట్‌లో అవకాశమిచ్చిన చంద్రబాబు.. జూనియర్లకే పెద్దపీట వేశారు.

కాగా, కింజరాపు అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం జిల్లా టెక్కలి), పొంగూరు నారాయణ(నెల్లూరు సిటీ), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం), ఆనం రామనారాయణరెడ్డి (నెల్లూరు జిల్లా ఆత్మకూరు), కొలుసు పార్థసారధి(నూజివీడు), నాస్యం మహహ్మద్ ఫరూక్‌(నంద్యాల)లకు గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. 

ముగ్గురు మహిళలకు చంద్రబాబు కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత(అనకాపల్లి జిల్లా పాయకరావుపేట) పాటు గుమ్మడి సంధ్యారాణి (పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు), సోమందేపల్లి సవిత (శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ) మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. 

తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులయ్యారు. నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ సహా 10 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై... మంత్రివర్గంలో చేరారు. 
 
తొలిసారి ఎమ్మెల్యేలు, మంత్రులు వీరే...
పవన్‌ కల్యాణ్‌ (పిఠాపురం), నారా లోకేశ్‌ (మంగళగిరి), సత్యకుమార్‌ యాదవ్‌ (అనంతపురం జిల్లా ధర్మవరం), కందుల దుర్గేష్ (పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు), గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), ఎస్.సవిత (పెనుకొండ), టీజీ భరత్ (కర్నూలు), మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (అన్నమయ్య జిల్లా రాయచోటి), వాసంశెట్టి సుభాష్ (కోనసీమ జిల్లా రామచంద్రాపురం) , కొండపల్లి శ్రీనివాస్ (విజయనగరం జిల్లా గజపతినగరం).

చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్లు...
పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలు సైతం తొలిసారి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. పయ్యావుల కేశవ్‌ (అనంతపురం జిల్లా ఉరవకొండ), నాదెండ్ల మనోహర్ (గుంటూరు జిల్లా తెనాలి), నిమ్మల రామానాయుడు(ప.గో. జిల్లా పాలకొల్లు), అనగాని సత్యప్రసాద్‌ (బాపట్ల జిల్లా రేపల్లె), వంగలపూడి అనిత (అనకాపల్లి జిల్లా పాయకరావుపేట), డోలా బాల వీరాంజనేయస్వామి (ప్రకాశం జిల్లా కొండపి), గొట్టిపాటి రవి బాపట్ల జిల్లా అద్దంకి), బీసీ జనార్థన్ రెడ్డి (నంద్యాల జిల్లా బనగానపల్లె) చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్‌ ఎమ్మెల్యేలు.

click me!