
మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే నేతల్లో టెన్షన్ మొదలైంది. మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చేదెవరు? ఉధ్వాసన ఎవరికి? అన్నదానిపైనే చర్చలు జోరుగా సాగుతున్నాయ్. మంత్రివర్గంలో నుండి ఎవరినీ తప్పించరని కొందరు అంటుంటే, కనీసం ఐదుగురిని తప్పిస్తారంటూ మరికొందరు చెబుతున్నారు. ఈ వాదనలు, ప్రచారాల మధ్య పలువురిలో ఆందోళన పెరిగిపోతోంది. ఎందుకంటే, ఇపుడున్న మంత్రివర్గం రెండున్నరేళ్ల క్రితం ఏర్పడింది. వీరిలో పలువురి పనితీరుపై చంద్రబాబునాయుడు బాహాటంగానే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు పలువురిలో టెన్షన్ కు కారణమైంది.
ప్రస్తుత మంత్రుల్లో రావెల కిషోర్ బాబు, కిమిడి మృణాళిని, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డిల పనితీరుపై చంద్రబాబు అంత సంతృప్తిగా లేరు. అదే సమయంలో వారి పనితీరుపైన కూడా వ్యతిరేకంగా అనేక నివేదికలు సిఎం వద్ద ఉన్నాయి. అదే సమయంలో వారిలో కొందరిపై అవినీతి ఆరోపణలు కూడా ముసురుకున్నాయ్. దాంతో వారిలో తొలగించేదెవరని అనే విషయమై చర్చ బాగా జోరందుకున్నది. వివాదాస్పద మంత్రుల్లో గంటా శ్రీనివాసరావు, నారాయణ, కెఇ కృష్ణమూర్తి పేర్లు వినబడుతున్నాయి.
ఇక, మంత్రివర్గంలోకి వస్తారనుకుంటున్న వారిలో లోకేష్ ఖాయం. అతనితో పాటు పలువురు సీనియర్లు కళావెంకట్రావ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనిత, బండారు సత్యనారాయణ రావు, తాడికొండ శ్రవణ్ తో పాటు ఫిరాయింపు ఎంఎల్ఏలున్నారు. వీరిలో భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయ్. సరే మంత్రివర్గ విస్తరణ అని ప్రక్షాళన అని రకరకాలుగా వినబడుతున్నది. ముహూర్తవం కూడా ఏప్రిల్ 2 అని 6 అని వినబడుతోంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా చంద్రబాబు ప్రాంతీయ, సామాజిక వర్గాల వారీగా చంద్రబాబు కసరత్తు చేస్తారన్నది అందరికీ తెలిసిందే.