
ప్రతిపక్ష నేత జగన్ విషయంలో టిడిపి మైండ్ గేమ బాగానే ఆడుతోంది. సమావేశాలు మొదలైన దగ్గర నుండి జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టారు. అందరూ జగన్ బ్రహ్మాండమని అనుకుంటున్న సమయంలో టిడిపి తన వ్యూహాన్ని మర్చింది. దాంతో జగన్ అధికార పార్టీ ఉచ్చులో పడిపోతున్నారు. అందుకే సభలో ప్రజాసమస్యల ప్రస్తావన పోయి వ్యక్తిగత చర్చలే సరిపోతోంది.
అందుకు టిడిపి మైండ్ గేమే కారణం. మైండ్ గేమ్ అంటే మరేం లేదు..వ్యక్తిగతంపై దాడి చేయటమే. అనవసర విషయాలను, చర్చ జరుగుతున్న అంశానికి సంబంధం లేని విషయాలను ప్రస్తావించటం ద్వారా సభను పక్కదోవ పట్టించటం. అందులో టిడిపి విజయం సాధించిందనే చెప్పాలి. టిడిపి గేమ్ ప్లాన్లో తెలిసి కూడా అదే ట్రాప్ లో జగన్ ఇరుక్కోవటం ఆశ్చర్యంగా ఉంది.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రమేయాన్నే తీసుకుందాం. మంత్రిని వైసీపీ బాగానే ఎండగట్టింది. మంత్రి వ్యవహారంపై రెండు రోజుల పాటు సభ దద్దరిల్లిపోయింది. దాంతో టిడిపి వ్యూహాత్మకంగా వైఎస్ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి ప్రస్తావించింది. సభలో మంత్రి లేదా జగన్ ఎవరో ఒకరే ఉండాలంటూ చంద్రబాబు తదితరులు జగన్ను రెచ్చగొట్టారు. గంటలకొద్దీ సభను జరగనీయకుండా అడ్డుకున్నారు. దాంతో అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చ ఎటుపోయిందో తెలీదు. అంటే సభలో అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని చర్చకు రానీయకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో జగన్ ప్రత్తిపాటి గురించి ప్రస్తావించగానే ప్రభుత్వం వెంటనే దాన్ని అందిపుచ్చుకుని మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నది.
అదేవిధంగా 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారం కూడా అలాగే జరిగింది. క్వశ్చన్ పేపర్ లీకేజి జరిగిందా లేదా అన్న చర్చనుండి మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను భర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ తో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. క్వశ్చన్ పేపర్ లీకేజి వ్యవహారం పక్కకుబోయి రెండు రోజుల చర్చ మొత్తం మంత్రులకు ఉధ్వాసన, నారాయణ విద్యా సంస్ధలపై నిషేధంపైనే జరిగింది.
పేపర్ లీకేజి వాస్తవమే. దాన్ని ప్రభుత్వం ఒకసారి అంగీకరించి, ఒకసారి కాదని ఇలా ఒక్కోసారి ఒక్కోవిధంగా చెబుతూ చివరకు లీకేజి వ్యవహారాన్ని పక్కదారి పట్టించింది. అందుకు జగన్ చదువును, రాజ్ భవన్ కార్యక్రమానికి హాజరయ్యే విషయం తదితరాలను ప్రస్తావించింది. చివరకు పేపర్ లీకేజి, మంత్రుల ప్రమేయంపై చర్చ పక్కదారి పట్టి లీకేజికి సాక్షి విలేకరే కారణమని సిఎం తేల్చేసారు. ప్రతిపక్షం దాడిని తట్టుకునేందుకు ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. విపక్షమే అప్రమత్తంగా ఉండాలి.