ఏప్రిల్ 2 ముహూర్తం

First Published Mar 30, 2017, 1:20 PM IST
Highlights

లోకేష్కు మంత్రి పదవి కోసం ఇంటిపోరు బాగా ఎక్కువగా ఉంది.

మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం కుదిరినట్లే ఉంది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9.25 గంటలకు సచివాలయ ప్రాంగణంలోనే మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. పనిలో పనిగా ఐదుమందికి ఉధ్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గం ఏర్పడి దాదాపు మూడేళ్లవుతోంది. పలువురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేనప్పటికీ తప్పని పరిస్ధితుల్లోనే వారిని నెట్టుకొస్తున్నారు. అనేక సందర్భాల్లో పలువురు మంత్రులపై బహిరంగంగానే చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలున్నాయి.

దానికితోడు కొడుకు లోకేష్ కూడా ఎక్కడా ఆగటం లేదు. అందుకే కుమారుడిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎవరూ ప్రశ్నించేందుకుండదని తీసుకుంటున్నారు. లోకేష్కు మంత్రి పదవి కోసం ఇంటిపోరు బాగా ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్లే చంద్రబాబు కూడా ఆమధ్య మాట్లాడుతూ, లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు స్వయంగా చెప్పారు. అందుకోసమే హడావుడి ప్రక్షాళన. దానికి తగ్గట్లే లోకేష్ కూడా ఈ రోజే ఎంఎల్సీగా ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం.

కొత్తగా ఎవరిని తీసుకుంటారన్న విషయం పక్కనబెడితే, పదవులు కోల్పోయే వారిలో కిమిడి మృణాళిని, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధరెడ్డి, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత పేర్లు ఎప్పటి నుండో వినబడుతున్నవే కదా? ఇక, ఫిరాయింపు ఎంఎల్ఏలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా? అన్న విషయమై గందరగోళం మొదలైంది.

click me!