రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు అండ: సీఎం జగన్

By narsimha lode  |  First Published Jul 27, 2023, 12:02 PM IST

జగనన్న విదేశీ  విద్యా దీవెన  పథకం కింద లబ్దిదారులకు  సీఎం జగన్ నిధులను విడుదల చేశారు. 


అమరావతి:  రాజకీయాలకు అతీతంగా  విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద  లబ్దిదారులకు  గురువారం నాడు ఏపీ సీఎం  వైఎస్ జగన్  నిధులను విడుదల చేశారు.పేద విద్యార్థులు  ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్శిటీల్లో విద్యనభ్యసించేలా  ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది  ప్రభుత్వం. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు  రూ. 1.25 కోట్లను ప్రభుత్వం సహాయంగా అందించనుంది.ఇతర సామాజిక వర్గాలకు  కోటి రూపాయాలను  ప్రభుత్వం చెల్లిస్తుంది.ఈ సందర్భంగా  సీఎం  వర్చువల్ గా  లబ్దిదారులనుద్దేశించి ప్రసంగించారు.

విదేశాల్లో  చదువుకునే విద్యార్థులకు  ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్  చెప్పారు. అర్హత ఉండి ఆర్ధికంగా  వెనుకబడి  విద్యార్థుల కోసమే జగనన్న విదేశీ  విద్యా దీవెన పథకమని సీఎం జగన్  తెలిపారు. పేదరికంలో ఉండి ఫీజులు కట్టలేని వారికి  ఈ స్కీమ్ ను వర్తింప చేస్తామని  సీఎం జగన్  వివరించారు.ప్రపంచస్థాయి కాలేజీల్లో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు వస్తున్నాయని  సీఎం జగన్ చెప్పారు.

Latest Videos

undefined

గతంలో కేవలం రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చేవారని సీఎం జగన్  గుర్తు  చేశారు. గతంలో మొక్కుబడిగా  విద్యార్థులకు  ఫీజులు చెల్లించారని  సీఎం జగన్ విమర్శించారు.గత ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు  రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు  రూ. 300 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. గతంలో లంచం ఇస్తేనే పథకాలు అమలు చేసేవారని  పరోక్షంగా చంద్రబాబు సర్కార్ పై  జగన్ విమర్శలు  చేశారు. 

కానీ తమ ప్రభుత్వం విద్యార్థుల  అవసరాలను దృష్టిలో ఉంచుకొని  కోటి రూపాయాల వరకు  ఫీజులను చెల్లిస్తుందన్నారు. అర్హత  ఉండి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం జగనన్న విదేశీ విద్యా దీవెన  పథకాన్ని  ప్రవేశ పెట్టినట్టుగా సీఎం చెప్పారు. ఈ పథకం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా ఆయన పేర్కొన్నారు.దేశంలో ఏ రాష్ట్రం కూడ ఇలాంటి మార్పులు తీసుకు రాలేదన్నారు.

ప్రపంచంలోని  టాప్  50 యూనివర్శిటీల్లోని  21 ఫ్యాకల్టీలను ఎంపిక చేసిన  విషయాన్ని సీఎం జగన్  ప్రస్తావించారు. విద్యార్థులు ధరఖాస్తులు పెట్టుకొంటే  అన్ని విధాలుగా  వారికి సహాయంగా ఉంటున్నామన్నారు సీఎం జగన్. రాష్ట్ర విద్యార్థులు  అత్యుత్తమ స్థాయిలో ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్షగా  సీఎం జగన్  పేర్కొన్నారు.తమ పిల్లల చదువు కోసం పేరేంట్స్ అప్పులు  చేసే పరిస్థితి ఉండొద్దని ఈ పథకం తీసుకువచ్చామన్నారు సీఎం.


 
 

click me!