విశాఖ అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత: పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట

By narsimha lode  |  First Published Aug 17, 2023, 10:09 AM IST

విశాఖ నగరంలోని అదానీ గంగవరం పోర్టు వద్ద ఇవాళ  ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోర్టు ముట్టడికి  కార్మిక సంఘాలు  పిలుపునిచ్చాయి. దీంతో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


విశాఖపట్టణం: నగరంలోని  అదానీ గంగవరం  పోర్టు వద్ద  గురువారంనాడు  ఉద్రిక్తత చోటు  చేసుకుంది.  ఈ పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 45 రోజులుగా  ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదానీ గంగవరం పోర్టులో  పనిచేస్తున్న  కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు  ఇవ్వాలని డిమాండ్  చేస్తూ  కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  45 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా కూడ గంగవరం పోర్టు యాజమాన్యం నుండి  స్పందన లేదని  కార్మిక సంఘాల  నేతలు  ఆరోపిస్తున్నారు. దీంతో  ఇవాళ గంగవరం పోర్టు ముట్టడికి  కార్మిక సంఘాలు  పిలుపునిచ్చాయి.  దీంతో  గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో  భారీగా పోలీసులను మోహరించారు. గంగవరం పోర్టు వైపునకు వెళ్లే మార్గాలను మూసి వేశారు పోలీసులు. 

అదానీ గంగవరం పోర్టు వద్ద ముళ్లకంచెను  దూకి  కార్మికులు  పోర్టు వైపునకు వెళ్లే ప్రయత్నం  చేశారు. ఈ సమయంలో  కార్మికులను  నిలువరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.  ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు  చేసుకుంది.  పోలీసులను తోసుకుంటూ  పోర్టులోకి వెళ్లేందుకు  కార్మికులు యత్నించారు.ఈ సమయంలో కొందరు పోలీసులు కిందపడిపోయారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.

Latest Videos

undefined

ఇదిలా ఉంటే  గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చిన కార్మికులకు  పలు పార్టీలు మద్దతు పలికాయి.  వామపక్షాలు, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీలు మద్దతు పలికాయి. కార్మికులతో కలిసి పోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేశాయి.  కార్మికులతో పాటు  పోర్టు నిర్వాసితులు కూడ  ఆందోళనలో పాల్గొన్నారు.  పోర్టు వద్ద రోడ్డుపై బైఠాయించి  నిరసనకు దిగారు  ఆందోళనకారులు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.  తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు.

పక్కనే ఉన్న  ప్రభుత్వ పోర్టులో  పనిచేస్తున్న కార్మికులకు  రూ. 36 వేల వేతనం ఇస్తున్నారన్నారు. కానీ అదానీ  గంగవరం పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు కేవలం  రూ. 15 వేలను మాత్రమే చెల్లిస్తున్నారని   కార్మిక సంఘాల నేతలు  చెబుతున్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు  కార్మికులు డిమాండ్  చేస్తున్నారు.  

 

 
 

click me!