అనంతలో విద్యార్ధులపై లాఠీచార్జీ: మంత్రి సురేష్‌ను ఘోరావ్ చేసిన విద్యార్ధి సంఘాలు, ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Nov 9, 2021, 5:17 PM IST


అనంతపురంలో విద్యార్ధులపై లాఠీచార్జీ ఘటన సెగ ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తగలింంది. ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలని విద్యార్ధి సంఘాల నేతలు మంత్రి సురేష్ ఘోరావ్ చేశారు. మీడియా సమావేశం నిర్వహిస్తున్న మంత్రిని అడ్డుకొన్నారు.


అమరావతి: అనంతపురంలో విద్యార్ధులపై లాఠాచార్జీ చేయడాన్ని నిరసిస్తూ ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశాన్ని విద్యార్ధి సంఘాలు మంగళవారం నాడు అడ్డుకొన్నాయి. మంత్రి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా విద్యార్ధి సంఘాల నేతలు అక్కడికి చేరుకొని మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్ధి సంఘాల నేతలతో మంత్రి సురేష్ మాట్లాడారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్ధి సంఘ నేతలను అదుపులోకి తీసుకొన్నారు.ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లను విలీనం చేయడాన్ని నిరసిస్తూ  అనంతపురంలోని  SSBN   కాలేజీ వద్ద సోమవారం నాడు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ లాఠీ చార్జని నిరసిస్తూ మంగళవారం నాడు అనంతపురంలో బంద్ నిర్వహిస్తున్నారు.

ఇవాళ సాయంత్రం అమరావతిలో మంత్రి Adimulapu Suresh మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే విద్యార్ధి సంఘాల నేతలు తమ చేతుల్లో జెండాలను చేతబూని మీడియా సమావేశంలోకి నినాదాలు చేస్తూ వచ్చారు. విద్యార్ధి సంఘాల నేతలను అడ్డుకోవడంలో పోలీసుల వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తాయి.

Latest Videos

also read:అనంతపురం: పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ విద్యార్థిణి అదృశ్యం... తల్లిదండ్రుల ఆందోళన

అనంతపురంలో విద్యార్ధులపై లాఠీచార్జీ జరగడాన్ని నిరసిస్తూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్ధి సంఘాల నేతలు. లాఠీచార్జీపై క్షమాపణలు చెప్పాలని విద్యార్ధి సంఘాల నేతలు కోరారు.ఈ విషయమై విద్యార్ధి సంఘాల నేతలతో మంత్రి సురేష్ మాట్లాడారు.ఎయిడెడ్ కాలేజీల విలీనం విషయంలో ప్రభుత్వం తీరును విద్యార్ధి సంఘాలు తప్పుబట్టాయి.  విద్యార్థి సంఘాలకు వివరణ ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నం చేశారు.  ఎయిడెడ్ పాఠశాలల వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని మంత్రి కోరారు.. లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులకు నష్టం కల్గిస్తున్నారన్నారు. ఈ విషయం తెలుసుకొన్న అదనపు పోలీస్ బలగాలు  రంగంలోకి దిగాయి. మీడియా సమావేశంలో ఉన్న విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే ఎస్ఎస్‌బీఎన్ కాలేజీలో సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని జయలక్ష్మి ఆ ఘటన తర్వాత కనిపించకుండా పోయింది. జయలక్ష్మి మంగళవారం నాడు ఓ వీడియో విడుదల చేసింది. తాను బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. సోమవారం జరిగిన ఘటనతో తనకు ఫోన్ కాల్స్ ఎక్కువగా రావడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు జయలక్ష్మి తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి జయలక్ష్మి కనిపించకుండా పోయింది. ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

అనంతపురంలో విద్యార్ధులపై లాఠీచార్జీ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.'గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని లోకేష్ ప్రశ్నించారు.ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

 

 

 


 

click me!