ఫిరాయింపు ఎంపిలకు త్వరలో షాక్ ?

First Published Feb 22, 2018, 9:33 AM IST
Highlights
  • వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ముగ్గురు ఎంపిల పరిస్ధితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది.

ఫిరాయింపు ఎంపిలకు పదవీ గండం పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. ఇంతకీ ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపిలెవరో అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. అదేలేండి నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి, కర్నూలు, అరకు ఎంపిలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలు. 

వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ముగ్గురు ఎంపిల పరిస్ధితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. దానికితోడు బుట్టా రేణుకపై ‘లాభదాయక పదవులు’ చట్టం ప్రకారం వేటు వేయాలంటూ పార్లమెంటరీ కమిటి కూడా సిఫారసు కూడా చేసింది. ఆ సంగతి అలా ఉంచితే తాజా మరో గండం పొంచి ఉండటంపై ఎంపిల్లో టెన్షన్ పెరిగిపోతోందట.

ఇంతకీ విషయం ఏమిటంటే, మార్చి 21వ తేదీన కేంద్రప్రభుత్వంపై వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోందన్న విషయం తెలిసిందే. ఒకవేళ వైసిపి గనుక 54 మంది ఎంపిల మద్దతు సంపాదిస్తే తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించాల్సిందే. ఒకవేళ అదే జరిగితే చాలా మంది ఎంపిల జాతకాలు మారిపోతాయనటంలో సందేహం లేదు. అటువంటి వారిలో టిడిపిలో ఉన్న ఫిరాయింపు ఎంపిలు ముందు వరసలో ఉంటారు.

చర్చ జరిగి తర్వాత ఓటింగ్ దాకా వస్తే వైసిపి ఎటూ విప్ జారీ చేస్తుంది. విప్ జారీ చేయటమంటే వైసిపి ఎంపిలందరూ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఓటింగ్ చేయాల్సిందే. పార్టీ నిర్ణయాన్ని థిక్కరిస్తే వెంటనే పదవి పోతుంది. పరిస్ధితి ఓటింగ్ దాకా వస్తే ఎటుతిరిగి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సుంటుంది వైసిపి ఎంపిలు.

గెలిచింది వైసిపి తరపునే అయినా ప్రస్తుతమున్నది టిడిపిలో. పార్లమెంటు రికార్డుల ప్రకారం పై ముగ్గురు ఎంపిలు వైసిపి ఎంపిలే. అంటే వైసిపి ఆదేశాలప్రకారమే వారు ఓటు వేయాల్సుంటుంది. వైసిపి ఏమో కేంద్రానికి వ్యతిరేకంగాను టిడిని ఏమో అనుకూలంగాను నిలబడ్డాయన్న విషయం అందరికీ తెలిసిందే.

దాంతో ఏం చేయాలో అర్ధంకాక ఫిరాయింపు ఎంపిల్లో టెన్షన్ మొదలైందట. అందుకు వారు విరుగుడుగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఓటింగ్ జరిగితే ఆ రోజుకు తమకు అనారోగ్యంగా ఉందని చెప్పి ఆసుపత్రిలో చేరటమో లేకపోతే అసలు దేశంలోనే లేమనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి  అవిశ్వాస తీర్మానం రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాల్సిందే.

 

click me!