
అమరావతి: ఈ మృగాళ్ల పాలనలోని రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న ఆకృత్యాలు చూస్తుంటే మహిళలెవరూ సంతోషంగా లేరని అర్థమవుతోందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు అన్నగా చిత్రీకరించుకున్నాడని... కానీ ముఖ్యమంత్రి అయ్యాక సొంత చెల్లెలికే అన్నగా పనికిరాకుండా పోయాడని అనిత ఎద్దేవా చేశారు.
'ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం దినోత్సవం నాడు నడిరోడ్డుపై దారుణంగా చంపబడిన రమ్య ప్రాణానికి ప్రభుత్వం ఖరీదు కట్టింది. ఆడపిల్లల మానప్రాణాలకు ఖరీదుకట్టే ప్రభుత్వాన్ని చూస్తుంటే సిగ్గుతో పాటు జుగుప్స కలుగుతోంది. ఆడబిడ్డ ప్రాణం ఖరీదు రూ.10లక్షలు, మానం ఖరీదు రూ.5లక్షలని ప్రభుత్వం లెక్కకట్టడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది. తమబిడ్డల మానప్రాణాలు కోల్పోయిన కటుంబాలకు తూతూమంత్రంగా సాయంచేస్తూ, దాన్నే న్యాయంగా భావిస్తున్న ప్రభుత్వపెద్దలు అసలు మనుషులా...లేక పశువులా అన్న సందేహం కలుగుతోంది'' అని అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
''రమ్య కుటుంబానికి పదిలక్షలిచ్చి న్యాయం చేశామని చెబుతున్న హోంమంత్రి, ముఖ్యమంత్రి తమ ఇళ్లల్లోని ఆడబిడ్డలకు కూడా అలాంటి రేటేకట్టి న్యాయం జరిగిందంటే సరిపోతుందా? ముఖ్యమంత్రి ఇంట్లోని ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ఏదో కామెంట్ పెట్టారని మహిళ అని కూడా చూడకుండా, సీఐడీ విచారణ పేరుతో వేధించారు'' అన్నారు.
read more ఆడపిల్లల ఉసురు మీకు మంచిది కాదు: సీఎం జగన్ పై లోకేష్ సీరియస్
''ఇక ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో యువతిపై అత్యాచారం జరిగితే నిందితుల్లో ఒకరిని పట్టుకొని, మరొకరికోసం వెతుకుతున్నామని డీజీపీ చెప్పడం సిగ్గుచేటు. తాడేపల్లి ఘటన, రమ్య హత్య ఘటనలు మరువకముందే గుంటూరు జిల్లా రాజుపాలెంలో దళితబాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనలు కళ్లముందు కదలాడుతుండగానే విజయనగరంలో యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి యత్నించారు. నేర ప్రవృత్తి గలవారు రాజ్యాలేలుతుంటే, ప్రభుత్వంలోని వారు రాసలీలల్లో మునిగితేలుతున్నారు. ఇక పోలీసులేమో పూర్తిగా టీడీపీనేతలను ఎలా అక్రమ అరెస్ట్ చేయాలన్నదానికే పరిమితమయ్యారు'' అని అనిత ధ్వజమెత్తారు.
''రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందంటే దానికి కారణం హోంమంత్రా లేక డీజీపీనా... లేదంటే వారిని ఆడిస్తున్న సజ్జలరామకృష్ణా రెడ్డిదా.. లేక రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి చేతగానితనమా? జగన్మోహన్ రెడ్డి జమానాలో మృగాళ్లు పేట్రేగిపోతున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎందుకూ పనికిరాని మంద 151 మంది ఉన్నారు. గన్ కంటే ముందు జగనన్న వస్తాడన్న మహిళా నాయకురాలు ఎక్కడుంది? మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమె కళ్లకు రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలపై జరుగుతున్న ఘటనలు కనిపించడంలేదా?'' అని అనిత నిలదీశారు.
''ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కూతుళ్లపై ఇలాంటి ఘటనలు జరిగితే, వారికికూడా పది లక్షలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందా? ప్రభుత్వం మృగాళ్లను, కామాంధులను వీధుల్లోకి వదిలేసి ఊరుకోబట్టే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దిశా చట్టం కింద ముగ్గురికి ఉరిశిక్షలు, 20 మందికి యావజ్జీవశిక్షలు వేయించామని చెప్పినందుకు హోంమంత్రి నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. హోంమంత్రికి ఏపాటి జ్ఞానముందో, ఆమెమాటలతోనే అర్థమైంది'' అని అనిత మండిపడ్డారు.