
విజయవాడ : తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని పోలీసులు అరెస్ట్ చేసారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు తెల్లవారుజామున కల్యాణి ఇంటిని చేరుకోవడంతో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా కాస్సేపు కుటుంబసభ్యులు అడ్డుకున్నప్పటికీ కల్యాణి బెడ్రూంలోకి వెళ్ళిమరీ పోలీసులు అరెస్ట్ చేసారు.
ఫిబ్రవరి 20న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య జరిగిన గొడవలో కల్యాణిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేయకుండా వుండేందుకు ఆమె ముందస్తు బెయిల్ కు ప్రయత్నించింది. అయితే బెయిల్ లభించకపోవడంతో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు కల్యాణి అజ్ఞాతంలో వుంటోంది.
Read More లోకేష్ క్యాంప్ వద్దకు వస్తే పంచెలూడదీసి కొడతారు: కేతిరెడ్డికి జేసీ కౌంటర్
కల్యాణి కోసం గాలిస్తున్న పోలీసులకు హనుమాన్ జంక్షన్ లోని నివాసంలో వున్నట్లు సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున పోలీసులు ఇంటిని ముట్టడించి కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ మహిళను బెడ్రూం లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏమిటంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. కనీసం నైట్ డ్రెస్ కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని కల్యాణి కుటుంబసభ్యులు ఆరోపించారు.
వీడియో
ఇదిలావుంటే కల్యాణి అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ''తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే కాక.... బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు!'' అంటూ కల్యాణి అరెస్ట్ వీడియోను జతచేస్తూ చంద్రబాబు ట్వీట్ చేసారు.
కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో అప్పుడే టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే ఘర్షణ కేసులో మరికొందరు టిడిపి నేతలపైనా పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇలా మహిళా నాయకురాలు కల్యాణిపై కూడా పోలీసులు రెండు కేసులు నమోదు చేసారు. తాజాగా ఈ కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయడం రాజకీయ అలజడి రేపుతోంది.