
ధర్మవరం : అప్పుల బాధతో గతంలొ తండ్రి ఆత్మహత్య చేసుకుంటే రుణయాప్ వేధింపులు కొడుకును బలితీసుకున్నాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న యువకుడు లోన్ యాప్ సిబ్బంది ఒత్తిడి భరించలేక ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ముత్యాలమ్మ కూలీ పనులు చేసుకుంటూ కొడుకు కప్పల నవీన్ కుమార్(24) ను చదివించుకుంటోంది.చేనేత కార్మికుడిగా పనిచేసే భర్త అప్పుల బాధతో ఎనిమిదేళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకోవడంతో కొడుకుకు అన్నీ తానే అయి ఏ లోటూ రాకుండా చూసుకునేది ముత్యాలమ్మ. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంసిఏ ద్వితీయ సంవత్సరం చదివేవాడు నవీన్.
అయితే నెల క్రితం ఆర్థిక అవసరాల కోసం ఓ లోన్ యాప్ ద్వారా రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు నవీన్. ఇటీవలే వడ్డీతో సహా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాడు. కానీ ఏవేవో లెక్కలు చెబుతూ ఇంకా డబ్బులు చెల్లించాలని లోన్ యాప్ సిబ్బంది నవీన్ ను వేధించడం ప్రారంభించారు. దీంతో బంధువుల వద్ద అప్పుచేసి మరో రూ.14వేలు చెల్లించాడు. అయినప్పటికి యాప్ నిర్వహకుల నుండి ఫోన్లు ఆగలేదు.
Read More షాకింగ్.. భర్త చనిపోయిన నాలుగు రోజులైనా.. శవం దుర్గంధం వెదజల్లుతున్నా.. అదే ఇంట్లో, అతనితోనే...
తల్లి ముత్యాలమ్మకు విషయం తెలపగా అధైర్యపడవద్దని... ఎంత డబ్బయినా చెల్లిద్దామని కొడుకుకు ధైర్యం చెప్పింది. అయినప్పటికి నవీన్ ఒత్తిడి నుండి బయటపడకుండా ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నవీన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు శవాన్ని చూసి గుండెలవిసేలా ముత్యాలమ్మ రోదిస్తుండటం అందరిచేతా కన్నీరు పెట్టిస్తోంది.
నవీన్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి ముత్యాలమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణమైన లోన్ యాప్ నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మవరం వాసులు డిమాండ్ చేస్తున్నారు.
లోన్ యాప్ వేధింపులు మరో యువకున్ని బలితీసుకోవడంతో రాష్ట్రంలో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే తెలుగురాష్ట్రాలో అనేక మంది ఆన్ లైన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకుని వేధింపులకు గురికాగా... తాజాగా నవీన్ బలయ్యాడు. లోన్ యాప్ బాధితుల ఆత్మహత్యలు ఆగకపోవడంతో ఇప్పటికే ఇలా లోన్స్ తీసుకున్నవారు తమ పరిస్థితి ఏంటోనని భయాందోళనకు గురవుతున్నారు. లోన్ యాప్ నిర్వహకులు, సిబ్బందిని కట్టడి చేయాలని వారు కోరుతున్నారు.