
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కోడి కత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలసిందే. అయితే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జగన్ మినహాయింపు కోరారు. గత విచారణ సందర్భంగా ఈరోజు(ఏప్రిల్ 10)న జగన్ కచ్చితంగా హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని.. కోర్టులో సీఎం జగన్ దరఖాస్తు దాఖలు చేశారు. కమీషనర్ ద్వారా తన సాక్ష్యాధారాలను నమోదు చేసుకునేందుకు అనుమతి కోరారు.
ఇక, 2018 అక్టోబరులో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు జగన్‌కు స్వల్ప గాయం అయింది. విమానాశ్రయంలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న జానపల్లి శ్రీనివాసరావు ఈ దాడి చేశాడు. అతడిని సీఐఎస్‌ఎఫ్ అరెస్ట్ చేసి రాష్ట్ర పోలీసులకు అప్పగించింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న జానపల్లి శ్రీనివాసరావుపై ఎన్‌ఐఏ చార్జిషీట్‌ను దాఖలు చేయడంతో ఎన్‌ఐఏ కోర్టు ఇటీవల విచారణ ప్రారంభించింది. సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌ను కోర్టు సాక్షిగా విచారించింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి కావడంతో సంఘటన జరిగిన తర్వాత దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
జగన్‌పై దాడికి ఉపయోగించిన కత్తిని ఎన్ఐఏ విచారణ అధికారి సమర్పించారు. నేరం జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్న మరో చిన్న కత్తి, పర్సు, మొబైల్ ఫోన్‌ను కూడా ఎన్ఐఏ సమర్పించింది. ఇక, దినేష్‌ను విచారించిన అనంతరం బాధితుడు సీఎం జగన్ సహా ఇతర సాక్షుల విచారణకు కోర్టు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జగన్, ఆయన వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్‌రెడ్డి తప్పనిసరిగా ఏప్రిల్ 10న హాజరుకావాలని కోర్టు పేర్కొంది. అలాగే ఏప్రిల్ 10 నుంచి 17 వరకు వేర్వేరు తేదీల్లో ప్రత్యేక కోర్టుకు హాజరుకావాలని 25 మంది సాక్షులకు సమన్లు జారీ చేసింది. ఇక, అంతముందు విచారణ సందర్భంగా జగన్ తన ఎదుట హాజరుకవాలని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించినప్పటికీ.. జగన్ విచారణకు హాజరు కాలేదు.