
ఊహించిన షాకే తగిలింది టిడిపికి. టిడిపి సీనియర్ నేత, ఎంఎల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. బుధవారం ఉదయం టిడిపికి రాజీనామా చేసి జగన్ను కలవటానికి హైదరాబాద్ బయలుదేరారు. కొద్దిరోజుల నుండి పార్టీలో అవమానాలకు గురవుతున్న చక్రపాణిరెడ్డి టిడిపికి రాజీనామా చేసి తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి బాటలోనే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. చక్రపాణి వైసీపీలో చేరటమన్నది టిడిపికి నైతికంగా దెబ్బే. ఎప్పుడైతే మోహన్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారో అప్పటి నుండే చక్రపాణిరెడ్డికి అవమానాలు మొదలయ్యాయి.
పార్టీ కార్యక్రమాలకు చక్రపాణిరెడ్డిని దూరంగా పెట్టేసారు. ఉపఎన్నికల్లో టిడిపి వ్యూహాలను చక్రపాణి తన సోదరుడు, వైసీపీ అభ్యర్ధి మోహన్ రెడ్డికి ఎక్కడ లీక్ చేస్తారో అన్న అనుమానంతో అసలు పార్టీ సమావేశాలకే పిలవటం మానేసారు. చంద్రబాబునాయుడు నంద్యాలకు వచ్చిన రెండుసార్లూ అసలు సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతో చక్రపాణికి అర్ధమైపోయింది తాను టిడిపిలో ఎంతో కాలం కొనసాగలేనని.
ఈ నేపధ్యంలోనే ఎన్నికల ప్రచారంలో ఉన్న మోహన్ రెడ్డి సోదరుని ఇంటికి వచ్చి మద్దతు అడగటమే కాకుండా వైసీపీలోకి వచ్చేయమంటూ ఓపెన్ గానే ఆఫర్ ఇవ్వటం జిల్లాలో పెద్ద సంచలనమైంది. ఆ విషయాన్ని స్వయంగా వైసీపీ అభ్యర్ధే మీడియాతో చెప్పటంతో టిడిపిలో కలకలం రేగింది. దాంతో నష్ట నివారణకు దిగిన చంద్రబాబు వెంటనే దూతలను పంపటం తదితర పరిణామాలన్నీ అందరూ చూస్తున్నదే.
మంగళవారం ఉదయం నుండి తన మద్దతుదారులతో మంతనాలు జరిపుతునే ఉన్నారు. అవమానాలు ఎదుర్కొంటూ టిడిపిలో ఉండాల్సిన అవసరం లేదన మద్దతు దారులు కూడా చక్రపాణిపై బాగా ఒత్తిడి పెట్టారు. దానికితోడు రాత్రి సోదరులిద్దరూ మరోసారి మాట్లాడుకున్నారు. దాంతో చక్రపాణి టిడిపిని వీడటం ఖాయమైపోయింది. 3వ తేదీ నంద్యాలలో జరిగే బహిరంగసభకు జగన్ హాజరవుతున్నారు. ఆరోజే పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. పార్టీలో ఉన్నంత వరకూ అవమానాలకు గురిచేసి తీరా పార్టీని వదిలేయటం ఖాయమని తెలిసిన తర్వాత పార్టీ మారద్దని చెబుతూ దూతలను పంపటం చంద్రబాబుకే చెల్లింది.