వాలంటీర్లపై వ్యాఖ్యలు .. పవన్ కల్యాణ్‌‌పై పరువు నష్టం దావా : చంద్రబాబు స్పందన ఇదే

Siva Kodati |  
Published : Jul 21, 2023, 03:42 PM IST
వాలంటీర్లపై వ్యాఖ్యలు .. పవన్ కల్యాణ్‌‌పై పరువు నష్టం దావా : చంద్రబాబు స్పందన ఇదే

సారాంశం

వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవ్వడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. 

వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్‌కు మద్ధతుగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ ద్వారా సంఘీభావం తెలిపారు. 

 

 

‘‘ తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు...రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యింది. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి... ఈ అణచివేత ధోరణి మానుకోవాలి’’.

‘‘నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు...కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు...పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలి ’’ .

‘‘ ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే  పెద్ద జోక్. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయి. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి... రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి....మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి ’’ అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇకపోతే.. వాలంటీర్లపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  కోర్టులో ఫిర్యాదు  చేయాలని  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు  చర్యలు తీసుకోవాలని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను బుధవారం ప్రభుత్వం ఆదేశించింది.  మహిళల అక్రమ రవాణాలో  వాలంటీర్లు  కారణమౌతున్నారని  పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ఈ నెల 9వ తేదీన వ్యాఖ్యలు చేశారు.  

తనకు కేంద్ర నిఘా సంస్థల నుండి ఈ సమాచారం ఉందని  వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  వాలంటీర్లు భగ్గుమన్నారు. మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో పలు చోట్ల  ఆందోళనలు నిర్వహించారు. ఈ వ్యాఖ్యలపై  పలు పోలీస్ స్టేషన్లలోనూ వాలంటీర్లు  పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!