శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు .. అవగాహన లేకనే ఇలా : విపక్షాలకు అంబటి రాంబాబు కౌంటర్

By Siva KodatiFirst Published Jul 21, 2023, 3:00 PM IST
Highlights

తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. ట్రస్ట్ ద్వారా దళారి వ్యవస్థకు చెక్ పడిందని రాంబాబు పేర్కొన్నారు. అవగాహన లేకపోవడంతోనే శ్రీవాణి ట్రస్ట్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌ని రాజకీయ ఆరోపణలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు. అవగాహన లేకపోవడంతోనే శ్రీవాణి ట్రస్ట్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ వినియోగిస్తోందని.. అంతేకాకుండా ట్రస్ట్ ద్వారా దళారి వ్యవస్థకు చెక్ పడిందని రాంబాబు పేర్కొన్నారు. గొప్ప ఆశయాలతో శ్రీవాణి ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. నూతన ఆలయాల నిర్మాణ, శిథిలావస్థలో వున్న ఆలయాల ఆధునీకీకరణ, ధూపదీప నైవేద్యాలకు ట్రస్ట్ నిధులు వినియోగిస్తున్నారని మంత్రి తెలిపారు. 

ఇకపోతే.. గత నెలలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోనే శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ట్రస్టును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.

ALso Read: శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు ఇచ్చిన ఆభరణాలివే.. ఎంత విలువో తెలుసా..?

దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ. 120.24 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. ఈ పనుల కోసం రూ. 139 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ. 227.30 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ట్రస్ట్‌పై అనవసర ఆరోపణలు మానుకోవాలని రాజకీయ నాయకులకు హితవు పలికారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా టీటీడీని సంప్రదించవచ్చని అన్నారు. ఎవరితో తనికీ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని  చెప్పారు. 
 

click me!