
తెలుగుదేశం పార్టీ ఎంపి, కేశినేని ట్రావెల్స్ యజమాని కేశినేని నాని పరువు రోడ్డున పడింది. ట్రావెల్స్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పడ్డారు. దశాబ్దాల తరబడి కేశినేని పేరుతో నాని కుబుంబం ప్రైవేటు బస్సులను తిప్పుతున్నది. అయితే, ఈ మధ్యనే ఆర్ధిక సమస్యలు మొదలైనట్లు ప్రచారం మొదలైంది. ఈ నేపధ్యంలోనే హటాత్తుగా ట్రావెల్స్ సంస్ధను మూసేస్తున్నట్లు నాని వారం క్రితం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకు ముందే రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంతో జరిగిన వివాదమే కారణమన్నట్లుగా సీన్ క్రియేట చేసారు. అయితే, అసలు కారణం అది కాదని తాజాగా వెలుగు చూస్తున్నది.
ట్రావెల్స్ కోసం బ్యాంకుల్లో తీసుకున్న వందల కోట్ల రుణాలను ఎగొట్టేందుకే నాని ప్లాన్ వేసినట్లు వైసీపీ ఆరోపిస్తున్నది. బస్సుల కొనుగోలుకు తీసుకున్న రుణాలను ఓ స్టార్ హోటల్ నిర్మాణంలో పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. అంటే ట్రావెల్స్ ను మూసేయాలని ఎప్పుడో నాని నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. కాకపోతే హటాత్తుగా మూసేస్తే అందరికీ అనుమానం వస్తుందనే పెద్ద సీన్ క్రియేట్ చేసారు. ట్రావెల్స్ సంస్ధలో పోటీ పెరిగిపోవటంతో పాటు నష్టాలు పెరిగిపోతున్నాయి. వాటిని తట్టుకునే పరిస్ధితి లేకపోవటంతో ట్రావెల్స్ మూసేయాలని గతంలోనే నిర్ణయించుకున్నారట.
ఎలాగూ మూసేయదలుచుకున్నారు కాబట్టే దాదాపు ఏడాది నుండి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వటం లేదట. అందుకనే విజయవాడలో ఇపుడు ట్రావెల్స్ సిబ్బంది నాని పరువు తీసేస్తున్నారు. తమకు అందాల్సిన జీతాల కోసం ఎంపి పార్టీ కార్యాలయం, ట్రావెల్స్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన మొదలుపెట్టారు. ఈనెల 15వ తేదీకల్లా సిబ్బంది జీతాలు చెల్లిస్తామంటూ నాని తరపున హామీ ఇవ్వటంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు ఉద్యోగులు. మొత్తానికి 15వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఈలోగా ఎంపి పరువుతో పాటు టిడిపి పరువు కూడా రోడ్డున పడిందన్నది మాత్రం ఖాయం.