
వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు ఎలా వుండబోతున్నాయనే విషయమై సర్వత్రా చర్చ మొదలైంది. చంద్రబాబునాయుడు-జగన్ మధ్యనే పోటి ఉంటుందని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. హటాత్తుగా పవన్ కల్యాణ్ ఎంటరయ్యారు. దాంతో సమీకరణలు మారిపోయే అవకాశాలున్నాయి. అయితే, పవన్ ఒంటరిగా పోటీ చేస్తానని చెబుతున్నా ఎవరి అనుమానాలు వారికున్నాయ్. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీనే లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ విచిత్రంగా పవన్ ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని మాట మాత్రంగా విమర్శించింది లేదు. అంశమేదైనా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది ఒక్క వైసీపీనే.
పవన్లో చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలి. జనాల మద్దతు కూడగట్టుకోవాలి. కానీ పవన్ ఆ పని చేయటం లేదు. అందుకే జనసేన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ప్రచారం మొదలైంది. ఎలాగంటే రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, పవన్ మాత్రం వైసీపీ బలంగా ఉన్నచోటే ప్రదాన దృష్టి పెట్టినట్లు కనబడుతోంది. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి గుత్తగా పడకుండా పవన్ చంద్రబాబుకు అనుకూలంగా కాపు కాస్తారన్నమాట.
ఇక, సమీకరణలు చూస్తే చంద్రబాబు, భాజపా కలిసే పోటీ చేసే అవకాశాలే ఎక్కువున్నాయి. జనసేన నేరుగా టిడిపితో సంబంధాలు పెట్టుకోదు. ఎందుకంటే, మళ్ళీ జనసేన కూడా మిత్రపక్షాలతో కలిస్తే వ్యూహం దెబ్బతింటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం వైసీపీకి పడిపోతాయి. అందుకనే విడిగానో లేక వామపక్షాలతోనో కలిసే అవకాశాలు ఎక్కువున్నాయి. వామపక్షాలతో ఎందుకంటే, అవి వైసీపీతో కలవకుండా అన్నమాట. ఈ పరిస్ధితుల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. వామపక్షాలు జనసేనతో కలవ కూడదనుకుంటే వామపక్షాలతో వైసీపీ కలవచ్చు.
రాజధాని రైతుల సమస్య మొదలు అగ్రిగోల్డ్ బాధితుల విషయం, ఫిరాయింపులకు మంత్రిపదవులు కట్టబెట్టిన విషయం ఇలా ప్రతీ అంశంలోనూ పవన్ ప్రభుత్వ అనుకూల వైఖరితోనే ఉన్నారన్నది వాస్తవం. ఈ విషయాలను తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు. చంద్రబాబు వ్యూహం ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్ళీ ఒంటరిని చేద్దామన్న ఆలోచనే స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులను జగన్ పునరావృతం కాకుండా చూసుకుంటారేమో చూడాలి. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకతను జగన్ ఏ మేరకు అందిపుచ్చుకుంటారన్నదే చూడాలి. సోషల్ మీడియాలో వైసీపీకి మద్దతుగా విపరీతమైన ఫాలోయింగ్ కనబడుతోంది. అద్దంలో చూపించినట్లు సోషల్ మీడియా ప్రతీ ఒక్కళ్ళ ఆలోచనలను, వ్యూహాలను స్పష్టంగా చూపిస్తోంది. చూద్దాం ఏం జరగుతుందో?