ఫోన్ ట్యాంపరింగ్‌ని రేప్‌తో పోలుస్తారా: సుచరితపై టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యా రాణి విమర్శలు

By Siva KodatiFirst Published Aug 18, 2020, 6:41 PM IST
Highlights

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫోన్ ట్యాంపరింగ్ అంశాన్ని అత్యాచారంతో పోల్చడం దుర్మార్గమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫోన్ ట్యాంపరింగ్ అంశాన్ని అత్యాచారంతో పోల్చడం దుర్మార్గమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆమె.. హోంమత్రి తీరు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ పై ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారని ఆమె చెప్పారు.

దానికే మీకెందుకంత ఉలుకు? చట్టవ్యతిరేకమైన ఫోన్ ట్యాపింగ్ కు వైసీపీ ప్రభుత్వం పాల్పడింది నిజంకాదా? ఏ తప్పు చేయనప్పుడు మీరెందుకు భయపడుతున్నారని ఆమె నిలదీశారు.  

వైసీపీ తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపిస్తే దాడులు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ప్రజలను దారి మళ్లించేందుకు విపక్షంపై అధికార పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని సంధ్యారాణి ఎద్దేవా చేశారు.

Also Read:ఫోన్ ట్యాపింగ్ వైసీపీకి కొత్త కాదు: డీజీపీ లేఖపై బాబు స్పందన ఇదీ

వైసీపీ ఏడాది పాలనలో మహిళలపై 400 పైగా అత్యాచారాలు జరిగినప్పుడు,  డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై పోలీసులు చితకబాదినా స్పందించలేదని ఆమె మండిపడ్డారు. డాక్టర్ అనితారాణిని వైసీపీ నేతలు వేధించినా కనీసం మాట్లాడలేదన్నారు.

మాస్కు పెట్టుకోలేదన్న కారణంతో చీరాల థామస్ పేటకు చెందిన దళిత యువకుడు కిరణ్ ని పోలీసులు కుళ్ల బొడిచినా, వర ప్రసాద్ కు పోలీసులు శిరోముండనం చేయించినా హోంమంత్రి కనీసం ఏం జరిగిందని కూడా ఆరాతీయలేదు సంధ్యా రాణి దుయ్యబట్టారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలికపై 12 మంది అత్యంత కిరాతకంగా నాలుగు రోజులు అత్యాచారం చేస్తే మహిళ అయుండీ హోంమంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ఆమె నిలదీశారు. హోంమంత్రికి అధికారుల బదిలీలు, ముఖ్యమంత్రి భజనపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై లేకపోవడం బాధాకరమని సంధ్యా రాణి ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, నేరాలపై ప్రశ్నిస్తే...ప్రతి చోటా కాపలా ఉండలేమని హోంమంత్రి సుచరిత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు.

శాంతిభద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి బాధ్యత మరిచి వ్యవహరిస్తే రాష్ట్రంలో ప్రజలకు రక్షణేదని ఆమె ప్రశ్నించారు.  ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి వెనక్కు తీసుకోవాలని సంధ్యా రాణి డిమాండ్ చేశారు. 

click me!