ఆ కుట్రలకు ఎన్టీఆరే కాదు.. నేను బాధితురాలినే: బాబుపై లక్ష్మీపార్వతి విమర్శలు

By Siva KodatiFirst Published Aug 18, 2020, 5:53 PM IST
Highlights

చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి. 

చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె..  బాబు అవినీతిపై సీబీఐ విచారణకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు లేఖ రాస్తున్నానని చెప్పారు.

చంద్రబాబు అవినీతిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు.  పోలవరం అవినీతి నుంచి వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న వైనం వరకు విచారణ జరగాలన్నారు.

చిత్తశుద్ధి వుంటే చంద్రబాబు తనపై  సీబీఐ విచారణను స్వాగతించాలని లక్ష్మీపార్వతి సవాల్ విసిరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు.

సైకిల్‌పై తిరిగే వేమూరి రాధాకృష్ణ ప్రతికాధిపతి ఎలా అయ్యారని లక్ష్మీపార్వతి నిలదీశారు. పచ్చళ్ళు అమ్ముకుని బతికిన రామోజీ.. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు జైలుకు వెళితేనే ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో చంద్రబాబు స్పష్టం చేయాలని.. కనీస ఆధారాలే లేకుండా ప్రధానికి బాబు లేఖ ఎలా రాస్తారని ఆమె నిలదీశారు. చంద్రబాబు కుట్రలకు ఎన్టీఆర్‌తో పాటు నేను కూడా బాధితురాలినేనన్నారు.

తాను సీఎంగా వున్న సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంపైనా కూడా చంద్రబాబు విమర్శలు చేశారని.. కానీ నేడు రాజకీయ అవసరాల కోసం సాగిల పడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు.

చంద్రబాబు నీచ రాజకీయాలపై తమకంటే బిజెపి నేతలకే ఎక్కువ తెలుసునని అన్నారు. చంద్రబాబు డిక్షనరీలో సిద్దాంతం అనే పదమే వుండదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక పార్టీ సహకారంతోనే ఎన్నికల్లో గెలిచాడే తప్ప, ఏనాడు సొంతగా పోటీ చేసి అధికారంను సాధించలేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిని తన కుడి, ఎడమలుగా పెట్టుకుని చంద్రబాబు అక్రమాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.

click me!