జగన్ అరెస్ట్ చేయిస్తే దశ తిరిగినట్లే...ఇక ధూళిపాళ్లకు కూడా: అశోక్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Apr 23, 2021, 6:45 PM IST
Highlights

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, ఏసీబీ ఆయనపై మోపిన సెక్షన్లు, సంగం డెయిరీ ఛైర్మన్ గా ఆయనకు ఎలా వర్తిస్తాయో చెప్పాలని ప్రభుత్వాన్ని అశోక్ బాబు డిమాండ్ చేశారు.  

గుంటూరు: ఇవాళ(శుక్రవారం) ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ గతంలో శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడి అరెస్ట్ ను గుర్తుచేసిందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ధూళిపాళ్ల అరెస్టే నిదర్శనమన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ ఏసీబీ ఆయనపై మోపిన సెక్షన్లు, సంగం డెయిరీ ఛైర్మన్ గా ఆయనకు ఎలా వర్తిస్తాయో చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.  

''ప్రభుత్వం చెబుతున్నట్టుగా నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ గా అవినీతికి పాల్పడ్డాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పాల డెయిరీలు, సహకార సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేసినప్పుడు, ప్రభుత్వ స్వాధీనంలో లేని వాటికి తాము ఎటువంటి రుణాలు ఇవ్వమని ప్రభుత్వం చాలా స్పష్టంగా గతంలో చెప్పడం జరిగింది. గుజరాత్ డెయిరీలకు ఇచ్చే ప్రోత్సహాకాలు తమకే ఇస్తే, రాష్ట్రంలో పాడిపరిశ్రమను మరింతబాగా అభివృద్ధి చేస్తామనిచెప్పినా కూడా ప్రభుత్వంతో సంబంధలేని వాటికి తాము రుణాలెలా ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది. అటువంటప్పుడు ఈరోజున ఏ అధికారంతో ఏసీబీ చట్టాన్నిసంగండెయిరీ ఛైర్మన్ గా ఉన్న నరేంద్రపై, ఇతరులపై ఉపయోగిస్తోందో చెప్పాలి'' అని అశోక్ బాబు డిమాండ్ చేశారు. 

''నరేంద్ర రౌడీ షీటరో, క్రిమినలో, టెర్రరిస్టో కాడు... అలాంటప్పుడు తెల్లవారుజామున దాదాపు 100 మంది వరకు ఆయన ఇంటిపైపడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. నరేంద్ర అరెస్ట్ తో ఆయనకు గానీ, టీడీపీకి గానీ వచ్చిన నష్టమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి నేడు అరెస్ట్ చేయిస్తున్న ప్రతివ్యక్తి రాజకీయంగా భవిష్యత్ లో మంచిస్థానానికి ఎదుగుతాడు. బంతిని గోడకేసి కొడితే ఎంతవేగంగా తిరిగొస్తుందో, అదేవిధంగా జగన్ చేతిలో అణచివేయబడుతున్న ప్రతిరాజకీయ నాయకుడు మున్ముందు మరింతగా ఉవ్వెత్తున ఎగసిపడటం ఖాయం'' అని పేర్కొన్నారు. 

video  ధూళిపాళ్లకు వైద్య పరీక్షలు... గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలింపు

''ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కేసులపై అరెస్ట్ చేసి ఏదో చేయాలని చూస్తే దానివల్ల ప్రభుత్వానికి, పాలకులకే నష్టం. పాల డెయిరీలు, సహాకార కేంద్రాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పినవారు ప్రభుత్వ అజమాయిషీ లేని సంస్థలకు ఛైర్మన్ గా ఉన్న వ్యక్తిపై ఏసీబీ చట్టాలను ఎలా ఉపయోగించిందో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.  పోలీస్ బలగాన్ని ఉపయోగించి చేస్తున్న అరెస్ట్ లు, పెడుతున్న అక్రమ కేసులు రేపు కోర్టుల్లో నిలబడవు'' అని అశోక్ బాబు తేల్చారు. 

''రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వ బలమేంటనేది తెలిసొచ్చేలా చేస్తాం. ముఖ్యమంత్రికి ఉన్న కక్షపూరిత దాహం తీరడం లేదు. ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లి నీకాల్మొక్తా బాంచన్ అనడం లేదు. ఆయన టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేసుకోవచ్చు. నరేంద్ర అరెస్ట్ లాంటివి ఎన్నిచేసినా సరే ముఖ్యమంత్రి, టీడీపీని మిల్లీమీటర్ కూడా కదపలేడు. భయపెట్టి, ప్రలోభపెట్టి, ఆశచూపి టీడీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి తీసుకుంటున్నారు. అలా వెళ్లినవారంతా వెళ్లిపోగా ఇప్పుడు ఉన్నవారంతా నిఖార్సైన, నిజమైన, గుండెధైర్యంతో పోరాడేవారు. వారంతా ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు'' అని పేర్కొన్నారు.

''జగన్మోహన్ రెడ్డి ఇప్పటికై నా తన ఫ్యాక్షన్ మైండ్ సెట్ మార్చుకోకుంటే అధికారం ఉన్నాకూడా ఒకస్థాయి దాటాక ఆయన ఏమీచేయలేడు. అటువంటి పరిస్థితే ముఖ్యమంత్రికి త్వరలో రాబోతుంది. దేవినేని ఉమా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునికూడా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. వైసీపీ నేతలే బాహటంగా కోర్టు ఆదేశాలిచ్చినా అమలు చేయాల్సింది తామేనని, తాము చేయకపోతే ఏం చేస్తారని తిరిగి ప్రశ్నిస్తున్నారు. నిస్సిగ్గుగా, ఇంతటి దిగజారుడు రాజకీయాలు రాష్ట్రంలోనే చూస్తున్నాం. ప్రభుత్వ పతనానికి ఈ చర్యలే నాంది పలుకుతాయి'' అని అశోక్ బాబు హెచ్చరించారు. 

click me!