ఒక్క ఓటమి .. వైనాట్ 175 అనే గొంతులు మూగబోయాయి : సజ్జలకు పయ్యావుల కేశవ్ కౌంటర్

By Siva KodatiFirst Published Mar 19, 2023, 9:14 PM IST
Highlights

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలని తమ సంఖ్యా బలం 23 వుందన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల శుభం పలికారంటూ సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నామా..? అనే అనుమానం సజ్జలకు కలగడం శుభ పరిణామమన్నారు. రెండు రోజుల ముందే ప్రజలు ఉగాది పంచాంగం చెప్పారని చంద్రబాబు కామెంట్ చేశారు.. ఆ వ్యాఖ్యలను సజ్జల ఎండార్స్ చేశారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అరాచకమే ఉందని ప్రజలెప్పుడో గుర్తించారని.. ఆ ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ అని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైనాట్ 175 అనే గొంతులు మూగబోయాయని.. ప్రజలు, ప్రజాస్వామ్యం అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవని కేశవ్ చురకలంటించారు. 

వైసీపీ డిక్షనరీలో లేని పదాలను సజ్జల మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క షాకుతోనే ప్రజలు సజ్జలకు గతాన్ని గుర్తు చేశారని.. బుల్డోజ్ అనేది వైసీపీ ఇంటి పేరన్నారు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్‌పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం బుల్డోజ్ చేయడం కాదా అని కేశవ్ నిలదీశారు. ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని తాము నమ్ముతున్నామని.. వాటిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: అర్జెంట్‌గా కుర్చీ కావాలి.. 175 స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసే దమ్ముందా : చంద్రబాబుకు సజ్జల సవాల్

మీ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎంకే నమ్మకం లేదని.. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టారని పయ్యావుల కేశవ్ చురకలంటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారని ఆయన నిలదీశారు. ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలని తమ సంఖ్యా బలం 23 వుందన్నారు. తమ దగ్గరున్న ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు, పోటీ చేయడాన్ని కూడా తప్పు పడతారా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మీ ఓటర్లు వేరా..? ముఖం మీద ఎవరూ మేం ఫలానా ఓటరని స్టిక్కర్ వేసుకుంటారా అని ఆయన నిలదీశారు. పులివెందుల నుంచి ఓ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలిచారు.. త్వరలో మరో ఎమ్మెల్సీ కూడా టీడీపీ నుంచి గెలవబోతున్నారని కేశవ్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ బాధ్యతను పెంచాయని ఆయన స్పష్టం చేశారు. 

click me!