నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు వంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రకాశం: తెలుగుదేశం పార్టీలో వలసల పర్వం కొనసాగుతుందా...? రాజ్యసభ సభ్యుల వలసలు అనంతరం ఇప్పుడు ఎమ్మెల్యే వంతు వచ్చిందా...? వల్లభనేని వంశీమోహన్ వలసలకు తెరలేపారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
వంశీ భాటలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పయనిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
వల్లభనేని వంశీమోహన్ ను టీడీపీలోనే ఉంచేందుకు చంద్రబాబు చేసిన రాజీ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. చివరికి తాను అండగా ఉంటానని వంశీకి చంద్రబాబు హామీ ఇచ్చినా వెనక్కి తగ్గలేదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపి బుజ్జగించినప్పటకీ వంశీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
తన అనుచరులపై కేసుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అలాంటి సమయంలో పార్టీ నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని వాపోయారు. సహకారం అందకపోగా టీడీపీలోనే కీలక నేత తనను టార్గెట్ చేసి వేధించారని ఆరోపిస్తూ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు వంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో వంశీ ఎపిసోడ్ కు తెరపడిందనుకుంటే తాజాగా అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సైతం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే.
గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో ఉన్నప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. జగన్ సైతం గొట్టిపాటికి అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే నియోజకవర్గం అభివృద్ధిపేరుతో తెలుగుదేశం పార్టీలో చేరిపోవడంతో ఆయన జగన్ కు దూరమయ్యారు.
ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరాలని భావిస్తున్నారట. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని తెగేసి చెప్తున్నారట. జిల్లా రాజకీయాలను పర్యవేక్షిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి గొట్టిపాటి సన్నిహితుడు కావడంతో ఆయకు రాయబారం పంపారని తెలుస్తోంది.
గొట్టిపాటి వైసీపీలో ఎంటరవ్వడాన్ని టీటీడీ చైర్మన్, ప్రకాశం జిల్లాకు చెందిన నేత వైవి.సుబ్బారెడ్డి ఇప్పటి వరకు అడ్డుపడ్డారు. అయితే జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చక్రం తిప్పడంతో బాలినేని ద్వారా వైసీపీలో చేరితే బాగుంటుందని ఆయన సన్నిహితులు చెప్తున్నారట.
ఇకపోతే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ సైతం వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కరణం వెంకటేష్ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్నారట. దానిపై హామీ ఇస్తే జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారట.
రాజకీయ ప్రత్యర్థి అయిన కరణం బలరాం ఫ్యామిలీని ఎదుర్కొనాలంటే వైసీపీలో చేరితేనే మంచిదని గొట్టిపాటి రవికుమార్ కు సన్నిహితులు చెప్తున్నారట. వైసీపీలో చేరడాన్ని ఒకరిద్దరు వ్యతిరేకించినా జగన్ అంగీకరిస్తే సరిపోద్దని ప్రచారం.
ఇదిలావుంటే త్వరలో వైసీపీలోకి ఆసక్తికర చేరికలు ఉంటాయని ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసంతృప్తి నేతల్ని బుజ్జగించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు నేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
వల్లభనేని వంశీ మారినా క్యాడర్ చంద్రబాబు వెంటే
Vallabhaneni Vamsi : పనిచేయని బుజ్జగింపులు.. వైసిపిలోకి వల్లభనేని వంశీ ఎంట్రీ ఖాయం