చింతమనేని మానభంగం చేశాడా, మీలా బాబాయిని చంపాడా...?: సీఎం జగన్ పై చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Oct 31, 2019, 8:44 PM IST
Highlights

చింతమనేని ఏ నేరం చేశారని ఆయనపై అన్ని కేసులు పెట్టారంటూ ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ దొంగతనాలు చేయలేదన్నారు. హత్యలు కూడా చేయలేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా మానభంగాలకు పాల్పడ్డాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 
 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వెనకేసుకువచ్చారు. 

చింతమనేని ఏ నేరం చేశారని ఆయనపై అన్ని కేసులు పెట్టారంటూ ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ దొంగతనాలు చేయలేదన్నారు. హత్యలు కూడా చేయలేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా మానభంగాలకు పాల్పడ్డాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

జగన్ లా సొంత బాబాయిని చంపలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమనేని ఏం చేశారని ఆయనపై 70 కేసులు పెట్టారంటూ నిలదీశారు. ఏదో అన్నాడని అన్ని కేసులు పెట్టి వేధిస్తారా...? ఇది న్యాయమా అంటూ ప్రశ్నించారు. 

ఇప్పటికే జైల్లో ఉన్న చింతమనేనిపై రోజుకు ఒక కేసు పెడతారా...?ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ నిలదీశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనా నేతలపైనా కేసులు పెట్టి వేధిస్తోందని ఇలాంటి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని విమర్శించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, విపక్షాలపై పడ్డారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 

చివరికి మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కూడా కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ మండిపడ్డారు. రూ.1.50లక్షలకు సంబంధించి చిన్న కేసును, ఐపీసీ 400 సెక్షన్ పెట్టి వేధించారన్నారు. దానిపై హోంమంత్రి సుచరిత గానీ, సీఎం జగన్ గానీ పట్టించుకోరన్నారు. 

గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తిపై ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే వారు తట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కోడెలను ప్రభుత్వమే హత్య చేయించిందంటూ తిట్టిపోశారు.

ఈ వార్తలన్నీ మీడియాలో వస్తున్నాయని ప్రస్తుతం మీడియాపై ఆంక్షలు విధిస్తారా అంటూ ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లను బ్యాన్ చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ట్రిబ్యునల్ ఏపీ వచ్చి విచారణ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో తిరిగి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5ల ప్రసారాలను పునరుద్ధరిస్తున్నారని అదే వైసీపీ ప్రభుత్వం యెుక్క తొలి పరాజయం అని చెప్పుకొచ్చారు. 

మీడియాను అణిచివేద్దామనుకున్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధిస్తూ విడుదల చేసిన జీవోను తక్షణమే రద్దు చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు నిలదీశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ బరితెగించాడు, పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అది ప్రజల హక్కు దాని పై మీ బోడిపెత్తనం ఏంటి: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు

​​​​​​​పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం
 

 
 

click me!