
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం, అక్రమ రవాణా చేయిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. అందువల్లే ఏపీలో గంజాయి,మాదకద్రవ్యాల విచ్చలవిడిగా సరఫరా అవుతోందని.... యువత వీటికి బానిస అయిపోతున్నారని అన్నారు. గంజాయి ఎగుమతుల్లో ఏపీ దేశంలోని మొదటిస్థానంలో వుందటేనే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చని టిడిపి ఎమ్మెల్యే అన్నారు.
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్.సీ.బీ) నివేదికప్రకారం ఏపీలో 2018 లో కేవలం 6,600 కిలోల గంజాయి పట్టుబడితే... నేడు 2లక్షల600 కిలోల గంజాయి పట్టుబడిందని వీరాంజనేయస్వామి అన్నారు. వైసిపి పాలకులు చివరకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గంజాయికి అడ్డాగా మార్చారని ఆందోళన వ్యక్తం చేసారు. తిరుమల కొండపైకి గంజాయి ఎలావెళ్లింది? అని వీరాంజనేస్వామి ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తిరుమల కొండపైకి గంజాయి చేరిందని అన్నారు. తిరుమల సెక్యూరిటీ అధికారుల తనిఖీ ఎలా సాగుతుందో గంజాయి కొండపైకి చేరడాన్ని బట్టే తెలుస్తుందన్నారు. ఎలాంటి తనిఖీలు లేకుండా కొండపైకి వాహనాల్ని అనుమతిస్తున్నారని స్పష్టమవుతోందని అన్నారు. తిరుమలలో గంజాయి దొరకడంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవస్థలను నాశనంచేస్తున్న జగన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఎమ్మెల్యే వీరాంజనేయులు హెచ్చరించారు.
Read More దేవుడు స్క్రిప్ట్ తిరగరాస్తున్నాడు ... జగన్ రెడ్డి కి సినిమా చూపించడం ఖాయం : దేవినేని ఉమ (వీడియో)
ఇటీవల తిరుమల కొండపై గంజాయి దందా కలకలం రేపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరం వద్ద 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. తిరుమల విజిలెన్స్ అధికారులు గంగాధరం కదలికలపై అనుమానంతో పట్టుకుని తనిఖీ చేయగా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి లభిచింది. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని పరమ పవిత్రమైన కొండపైకి తరలించి అమ్ముతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
తిరుమల కొండపై గంజాయి రవాణా ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. ఏపీలో గంజాయి భూతం రోజురోజుకూ మరింత విస్తరిస్తోందని... ఇప్పుడు ఏకంగా పవిత్రమైన తిరుమల కొండపైకి చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుందని అన్నారు. ‘అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో గంజాయి ప్రదేశ్ అయ్యింది. బడిలో, గుడిలో గంజాయితో రాష్ట్రం పరువు మంటగలిసిపోయింది. ఇందుకా జగన్ నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది?' అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.